సర్ పేరుతో రక్తంలేని నరమేధం

సర్ పేరుతో రక్తంలేని నరమేధం
  • టీసులివ్వకుండానే ఒక వర్గం ఓట్ల తొలగింపు: వక్తలు

హైదరాబాద్‌, వెలుగు: దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో రక్తపాతం లేని రాజకీయ నరమేధం జరుగుతున్నదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, న్యాయనిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఒక వర్గం ఓట్లను తొలగించే భారీ కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ‘సర్‌ సిటిజన్‌ ఓటింగ్‌ రైట్స్‌’ అనే అంశంపై రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సెమినార్‌ జరిగింది. వేదిక నేత కామేశ్వబాబు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ టి.రజని, ప్రముఖ విశ్లేషకులు పరకాల ప్రభాకర్, తెలకపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ రజని మాట్లాడారు. రాజ్యాంగంలోని పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఓటును తొలగించే ముందు సదరు వ్యక్తికి నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలన్నారు.  

అవేమీ లేకుండానే విచ్చలవిడిగా ఓట్లను తీసేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వాలను ఓటర్లు ఎన్నుకునేవారని, ఇప్పుడు ప్రభుత్వాలే తమకు కావాల్సిన ఓటర్లను ఎంచుకుంటున్నాయని ప్రముఖ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ అన్నారు. బిహార్​లో మొత్తం 8.22 కోట్ల ఓట్లు ఉంటే.. అందులో దాదాపు 80 లక్షల ఓట్లను తొలగించారని, ఇందులో 33 శాతం ఒకే వర్గానికి చెందినవారని గుర్తుచేశారు. యూపీలో 2.93 కోట్లు, మహారాష్ట్రలో 93 లక్షలు, గుజరాత్‌లో 72 లక్షలు, బెంగాల్‌లో 58 లక్షల ఓట్లను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

ఈసీ చేపట్టింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదని, ‘రిమూవల్’ అని తెలకపల్లి రవి అన్నారు. ‘సర్‌’ పేరుతో ఓట్లను తొలగిస్తూ రాజకీయ పార్టీలు గెలిచేందుకు ఈసీ సహకరిస్తున్నదన్నారు. ఈ సెమినార్‌లో సీపీఎం నేత డీజీ నర్సింహారావు, ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి, ఉమామహేశ్వర్ రావు, ఏఎస్​వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.