హైదరాబాద్: కుటుంబ కలహాలతో భార్యాభర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఐలాపూర్ తాండాలో కుటుంబ కలహాలతో కర్నూలు జిల్లా వీరవెల్లి గ్రామానికి చెందిన లాల్ శేఖర్ (32), అతని భార్య అనూష ఆత్మహత్య చేసుకున్నారు. భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన అనూష అక్కడే ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
విషయం తెలుసుకున్న భర్త లాల్ కుమార్ భార్య శవాన్ని చూసి తనకు ఏమైనా జరుగుతుందేమోనని భయాందోళనకు గురై ఇంటికి వచ్చి తను కూడా ఆత్మహత్యకు పాల్పడి చనిపోయాడు. అమీన్ పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా.. గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ ముందు పవన్ అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పురుగుల మందు తాగి పవన్ ఆత్మహత్యకు యత్నించాడు. పవన్ను గచ్చిబౌలి పోలీసులు కొండాపుర్ హస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కొండాపుర్ హాస్పిటల్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు.
►ALSO READ | చిట్టీ డబ్బులు అడిగినందుకు తండ్రీ కొడుకులు కలిసి చితకబాదారు.. జగిత్యాల జిల్లాలో వ్యక్తి మృతి
గచ్చిబౌలి గోపన్ పల్లి NTR నగర్లో పవన్ నివాసం ఉంటున్నాడు. చిట్టీ విషయంలో పవన్, అతని స్నేహితుడి మధ్య గొడవ జరిగింది. గొడవ కారణంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు పవన్, అతని స్నేహితుడు వెళ్లారు. ఈ క్రమంలోనే పవన్ ఆత్మహత్యకు యత్నించాడు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
