2027 ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా భారత జట్టు ఇకపై మరిన్ని వన్డే మ్యాచ్‌లు ఆడేలా ప్రణాళిక రచిస్తోంది. మే నెలలో ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇండియన్ టీమ్ పూర్తి దృష్టిని వన్డే క్రికెట్‌పై పెట్టబోతుంది. ఇటీవలి కాలంలో భారత్ రెండు టీ20 ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ విజయం సాధించినప్పటికీ 2011 నుంచి వన్డే వరల్డ్ కప్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 2023లో స్వదేశంలో జరిగిన టోర్నమెంట్లో ఫైనల్ వరకు దూసుకెళ్లినా, ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2027లో కప్ గెలవాలనే పట్టుదలతో బీసీసీఐ ముందుకు సాగుతుంది.
విదేశీ టూర్ లో అదనపు వన్డేలు ఆడించేందుకు పలు దేశాల క్రికెట్ బోర్డులు బీసీసీఐ ముందు అనేక ప్రతిపాదనలు పెట్టారు. ఈ ప్రతిపాదనలకు బీసీసీఐ కూడా సానుకూలంగా స్పందించినట్లు టాక్. ఈ నిర్ణయంతో వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వారికి వరల్డ్ కప్ కోసం మెరుగ్గా సిద్ధం అయ్యేందుకు మరింత అవకాశం దొరుకుతుంది. మరిన్ని మ్యాచ్‌లు ఆడటం వలన వారి ఫామ్, ఫిట్‌నెస్‌కు ఎంతో దోహదపడుతుందని ఇండియన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది.
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో ఒక టెస్ట్, మూడు వన్డే మ్యాచులు ఆడనుంది. అనంతరం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లో పాల్గొననుంది. ఈ టూర్ లోనే ఐర్లాండ్‌తో కూడా మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ ఉంది. మరోవైపు తమతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాలని శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐని అభ్యర్థించినట్లు తెలుస్తుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP) ప్రకారం బంగ్లాదేశ్, వెస్టిండీస్, న్యూజిలాండ్‌తో కూడా సిరీస్‌లు కొనసాగనున్నాయి. ముఖ్యంగా కివీస్ తమ టూర్ లో అదనంగా వన్డేలు చేర్చాలని కోరినట్లు ప్రచారం జరుగుతుంది.
