మేకలు, గొర్రెల నుంచి రక్తం తీసి ఏం చేస్తున్నారంటే.. మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ చెప్పిన కీలక విషయాలు

మేకలు, గొర్రెల నుంచి రక్తం తీసి ఏం చేస్తున్నారంటే.. మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ చెప్పిన కీలక విషయాలు

హైదరాబాద్: కీసర పరిధిలో మేకలు, గొర్రెల నుంచి అక్రమంగా రక్తం తీస్తున్న ముఠాను గుర్తించామని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ మీడియాకు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. వెటర్నరీ శాఖకు, GHMC అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు. రక్తాన్ని దేనికి వాడతారు.. అక్రమంగా తీసి ఏం చేస్తారు.. క్లినికల్ ట్రయల్స్ ఎలా చేస్తారు అనే వివరాలు రావాల్సి ఉందని చెప్పారు.

కాచిగూడలోని CNK ల్యాబ్కి సేకరించిన రక్తాన్ని తరలిస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. రక్తం తీయడం మాత్రం అక్రమం అని గుర్తించామని.. వెటర్నరీ డాక్టర్ సమక్షంలో తీయాలి కానీ.. నకిలీ వెటర్నరీ డాక్టర్ తీస్తున్నాడని డీసీపీ చెప్పారు. అలా తీసిన రక్తాన్ని అక్రమంగా చికెన్ షాప్లో నిల్వ చేస్తున్నాడని, త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ మీడియాకు వివరించారు.

ఎటువంటి వైద్య ప్రమాణాలు పాటించకుండా మేకల నుంచి అడ్డగోలుగా రక్తం సేకరిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం సత్యనారాయణ కాలనీలోని సోను చికెన్ అండ్ మటన్ షాపులో మేకలు, గొర్రెల నుంచి రక్తం సేకరిస్తున్నారని సమాచారం రావడంతో కీసర పోలీసులు ఆదివారం ఉదయం దాడులు చేశారు. షాప్ యజమాని సుందర్ సోను, ఉద్యోగి అఖిల్​ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 130 ప్యాకెట్లు రక్తం స్వాధీనం చేస్తున్నారు.

►ALSO READ | హైదరాబాద్ నుంచి సంక్రాంతికి ఊరెళ్లే పబ్లిక్కు పోలీసుల ముఖ్య హెచ్చరిక

సేకరించిన రక్తాన్ని కాచిగూడలోని సీఎన్​కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌‌‌‌ పోర్ట్స్ సంస్థకు తరలిస్తున్నారని, అక్కడి నుంచి ల్యాబొరేటరీల్లో ప్లేట్లెట్స్​తయారీకి వినియోగిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వైద్య పర్యవేక్షణ లేకుండా అడ్డగోలుగా రక్తం సేకరించడం వల్ల మేకలు ఒక రోజులోనే మృతి చెందుతున్నాయని పోలీసులు తెలిపారు. ఇలా రక్తం తీసిన మేకలను చంపి సోను తన షాపులో మటన్ అమ్ముతున్నట్లు చెప్పారు. జీవాలపై ఇలాంటి క్రూర చర్యలు చట్టవిరుద్ధమని, జంతు సంక్షేమ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.