హైదరాబాద్: సంక్రాంతి పండుగకు పెద్ద ఎత్తున నగరాన్ని విడిచి ప్రజలు పల్లెబాట పడతారని.. ఇళ్లలో విలువైన ఆభరణాలు, నగదు బయటపెట్టి వెళ్ళకూడదని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ సూచించారు. కాలనీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు కచ్చితంగా వాచ్ మెన్ను పెట్టుకోవాలని ఆయన చెప్పారు. సెక్యూరిటీ పరంగా అన్ని చర్యలు అసోసియేషన్లు తీసుకోవాలని, పండగకు వెళ్లేవారు లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పెట్రోలింగ్ టీమ్స్ ఆ ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తారని ఆయన వివరించారు.
క్రైమ్ టీమ్స్, లాండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా నిఘా పెడతారని, మీ పరిసరాల్లో అనుమానిత వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలు, క్యాష్ లాకర్లలో భద్రపరచాలని, ఇంట్లో ఎక్కువ నగదు పెట్టడం మంచిది కాదని చెప్పారు. ఊరికి వెళ్లే ముందు ఇంటి యజమానులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వరుస పండుగల సీజన్ వచ్చేసింది. మరో పది రోజుల్లోనే సంక్రాంతి పండగ జరగనుండగా, ఈ నెలాఖరులోనే సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. వనదేవతల దర్శనానికి ముందు తీర్థయాత్రలకు వెళ్లేవారితో పాటు పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న వారిని దొంగతనాలు కలవరానికి గురి చేస్తున్న సంగతి తెలిసిందే. మేడారం జాతర సమీపిస్తుండటంతో చాలామంది వేములవాడ, కొండగట్టు, తదితర దేవుళ్ల మొక్కులు తీర్చుకునేందుకు ఇండ్లకు తాళాలు వేసి వెళ్తున్నారు. ఇదే సమయంలో గుర్తు తెలియని దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు.
►ALSO READ | వాళ్లు వీళ్లే : తెలంగాణ మావోయిస్టులు మిగిలింది 17 మంది మాత్రమే
మేడారంతో పాటు ఐనవోలు, కొత్తకొండ, అగ్రంపహాడ్ తదితర జాతర్లు సమీపిస్తుండగా, సంక్రాంతి పండుగకు సొంతింటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నవారు అలర్ట్గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పండుగలకు సొంతూళ్లకు వెళ్లినా, తాళాలు వేసి తీర్థయాత్రలకు వెళ్లినా పక్కింటి వారితో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. ముఖ్యంగా భద్రత కోసం కాలనీలు, ఇండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
