సినిమా , టెలివిజన్ రంగాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే క్రిటిక్స్ చాయిస్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వరుసగా నాలుగోసారి ప్రముఖ కమెడియన్ చెల్సీ హ్యాండ్లర్ హోస్ట్ గా వ్యవహరించారు. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. కాలిఫోర్నియాలోని సాంటా మోనికా బార్కర్భంగర్ లో నిర్వహించిన ఈ ఫెస్టివల్ లో సినిమా, టీవీ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొ న్నారు.
‘ఆడాల్సెన్స్’ క్లీన్ స్వీప్..
ఈ క్రిటిక్స్ చాయిస్ అవార్డుల వేడుక లో'ఆడాల్సెన్స్' సత్తా చాటింది. 4 కేటగిరీల్లో ఇది అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ సిరీస్ తో పాటు ఇందులో నటనకు గానూ ఉత్తమ నటుడిగా స్లీఫెన్ గ్రాహం, ఉత్తమ సహాయనటిగా ఎరిన్ డోహెర్టీ పురస్కారాల్ని సొంతం చేసుకున్నారు. ఈ సిరీస్ లో తన నటనతో మెప్పించిన ఓవెన్ కూపర్ ఉత్తమ సహాయ నటుడిగా అతి చిన్న వయసులోనే ఈ అవార్డును సొంతం చేసుకొని రికార్డు సృష్టించాడు.
ఇక సినిమా విభాగంలో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ బెస్ట్ మూవీగా అవార్డును గెలుచుకుంది. ఇక బెస్ట్ డైరెక్టర్ గా పాల్ థామస్ ఆండర్సన్, ఉత్తమ నటుడిగా టిమోథ్ చలమెట్, ఉత్తమ నటిగా జెన్నీ ఐక్లీ, బెస్ట్ సపోర్టింగ్ నటులుగా జాకబ్ ఎల్లోర్డి. అమి మడిగన్ పురస్కారాలు అందుకున్నారు.
ఎందుకీ అవార్డులు ప్రత్యేకం?
ఆస్కార్ రేసులో నిలిచే చిత్రాలను అంచనా వేయడానికి క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు దిక్సూచిగా నిలుస్తాయి. ఇక్కడ అవార్డు గెలుచుకున్న వారు ఆస్కార్ లోనూ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్ సాధించిన ఈ వేడుక, హాలీవుడ్ యొక్క సృజనాత్మకతకు అద్దం పట్టింది.
