3 వేల కోట్లకు ముంచేసిన సాహితీ ఇన్ఫ్రాపై నాలుగేళ్ల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు

3 వేల కోట్లకు ముంచేసిన సాహితీ ఇన్ఫ్రాపై నాలుగేళ్ల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు

హైదరాబాద్: హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారిన సాహితీ ఇన్ ఫ్రా స్కాంపై సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సాహితీ స్కాం 3 వేల కోట్లుగా సీసీఎస్ పోలీసులు తేల్చారు. నాలుగేళ్ల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయడం గమనార్హం.  సాహితీ ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మోసం చేసినట్లు ఇప్పటికే ఈ సంస్థపై 64 కేసులు నమోదయ్యాయి. 64 కేసులపై సీసీఎస్ టీం విచారణ జరుపుతోంది. అమీన్పూర్లోని శర్వాణి ఎలైట్కు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. 17 కేసులకు సంబంధించి సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

శర్వాణి ఎలైట్కి సంబంధించి రూ.500 కోట్ల పైచిలుకు వసూలు చేసినట్లు గుర్తించారు. వసూలు చేసిన డబ్బులు మొత్తాన్ని సొంత ప్రయోజనాలకు సాహితీ లక్ష్మీనారాయణ వాడుకున్నాడు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో సాహితీ లక్ష్మీనారాయణ డబ్బులు వసూలు చేశాడు. అతి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ సాహితీ లక్ష్మీనారాయణ  మోసం చేశాడు. సాహితీ స్కాంపై  మొత్తం 13 మంది నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. 

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో సాహితీ ఇన్ ఫ్రా ఓ హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టింది. 32 ఫ్లోర్లతో 10 హైరైజ్ టవర్స్ నిర్మిస్తున్నట్లు ప్రచారం చేసుకుంది. ప్రీ లాంచ్, ఆఫర్స్ పేరుతో 2019 నుంచి 2022 వరకు మార్కెటింగ్ చేసింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండానే ప్రీ లాంచ్ ప్రారంభించింది. 2019 జూన్ వరకు 1,752 మందిపైకి పైగా కస్టమర్ల నుంచి రూ.504 కోట్లు వసూలు చేసింది. 

ఇలా 9 ప్రాజెక్టుల పేరుతో దాదాపు 3వేల 500 మంది దగ్గర వేల కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసింది. అయితే, ప్రీ లాంచ్ అగ్రిమెంట్ ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. తీసుకున్న డబ్బును బాధితులకు తిరిగి ఇవ్వలేదు. దీంతో 2022 ఆగస్టులో 240 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెదక్, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 50కి పైగా కేసులు నమోదయ్యాయి.