మా ఇంటి కులదైవం లక్ష్మీ నరసింహాస్వామితోపాటు నా ఇద్దరు కొడుకులపై ఒట్టేసి చెబుతున్నాను.. నాది ఆస్తుల పంచాయితీ కాదు.. నాది ఆత్మగౌరవ పంచాయతీ అంటూ భావోద్వేగంతో.. మండలిలో ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత. చాలా మంది చాలా రకాలుగా నాపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని.. వాళ్లకు ఇదే నా సమాధానం అంటూ కన్నీళ్లతో చెప్పుకొచ్చారు కవిత.
బీఆర్ఎస్ పార్టీ నుంచి రాత్రికి రాత్రి.. నాపై సస్పెన్షన్ వేటు వేశారని.. ఉరి తీసే వాళ్లకు కూడా చివరి అవకాశం ఉంటుందని.. నాకు అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా పార్టీ నుంచి బయటకు పంపించారంటూ శాసన మండలిలో కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత.. పార్టీలోని కొందరు వ్యక్తులతోపాటు కాంగ్రెస్ పార్టీ సైతం తనపై ఆరోపణలు, విమర్శలు చేస్తుందని.. అలాంటి ఆరోపణలు, విమర్శలకు ఇదే సమాధానం అంటూ చెప్పుకొచ్చారు కవిత.
కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయని.. అందుకే పార్టీ నుంచి బయటకు పంపించినట్లు జరుగుతున్న ప్రచారం తప్పన్నారు. మా ఇంటి కులదైవం, నా ఇద్దరు బిడ్డలపై ఒట్టేసి చెబుతున్నాను.. నా పోరాటం ఆస్తులపై కాదు.. ఆ పోరాటం ఆత్మగౌరవంపై అంటూ మండలిలో ప్రకటనతో స్పష్టత ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత.
20 ఏళ్లుగా తెలంగాణ కోసం కొట్లాడినా.. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడినా.. జైలుకు వెళ్లినా అయినా పార్టీలో సరైన గుర్తింపు లేదన్నారు కవిత. ఉద్యమకారుల కోసం.. బీసీల హక్కుల కోసం.. మహిళల సంక్షేమం కోసం పోరాడుతున్నానని.. రాబోయే రోజుల్లోనూ ఇదే తరహాలో పోరాటం చేస్తానంటూ వివరించారు ఎమ్మెల్సీ కవిత.
