తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ దర్శకుడు హెచ్ . వినోద్ కాంబినేషన్ లో వస్తున్న హైవోల్టేజ్ యాక్షన్ చిత్రం 'జన నాయకుడు' . సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి, ఇది నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల విడుదలైన ‘జన నాయకుడు’ ట్రైలర్ చూసిన తర్వాత నెటిజన్లు ఈ రెండు సినిమాల మధ్య పోలికలను గుర్తిస్తున్నారు. సంక్రాంతికి 'జన నాయగన్' రిలీజ్ అవుతోంది.
‘భగవంత్ కేసరి’కి పెరిగిన క్రేజ్
ఈ పోలికల నేపథ్యంలో.. అసలు ఈ రెండు సినిమాలకు సంబంధం ఉందా అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఫలితంగా, దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన ‘భగవంత్ కేసరి’ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఒక కొత్త సినిమా విడుదలవుతుంటే, పాత సినిమా ట్రెండ్ అవ్వడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భగవంత్ కేసరిలో బాలయ్య ఒక యువతిని ధైర్యవంతురాలిగా తీర్చిదిద్దే గార్డియన్‌గా కనిపిస్తారు. జన నాయకుడులో కూడా విజయ్ పోలీస్ అధికారిగా, ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న కుమార్తెగా తండ్రిగా కనిపిస్తారు. పోలీస్ అధికారిగా తన కుమార్తె చుట్టూ తిరిగే కథతో కనిపిస్తున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. విజయ్ జన నాయకుడు పక్కా బాలయ్య 'భగవంత్ కేసరి'ని కాపీ కొట్టారన్న చర్చ నడుస్తోంది.
దర్శకుల వివరణ ..
అయితే ఈ రీమేక్ వార్తలపై దర్శకుడు హెచ్. వినోద్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఈ వార్తలను పూర్తిగా ఖండించలేను, అలాగని ధ్రువీకరించలేను. సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అంటూ సస్పెన్స్ పెంచారు. మరోవైపు అనిల్ రావిపూడి కూడా విజయ్‌తో తనకు ఉన్న పరిచయం గురించి చెబుతూ, కథలో మార్పులు ఉండవచ్చని హింట్ ఇచ్చారు. ఈ రెండు సినిమాల దర్శకులు స్పందించినప్పటికీ రూమర్స్ కు మాత్రం చెక్ పడలేదు. ఇప్పుడు అందరూ భగవంత్ కేసరి మూవీ చూసేస్తున్నారు. దీంతో అమెజాన్ ప్రైమ్ లో ఉన్న ఈ చిత్రం రెండేళ్ల తర్వాత ఓటీటీలో ట్రెండింగ్ లో టాప్ 1 లోకి వచ్చేసింది.
‘జన నాయకుడు’ పై భారీ హైప్..
విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఆయన నటిస్తున్న ఆఖరి సినిమా కావడంతో దీనిపై భారీ హైప్ ఉంది. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్, సునీల్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ప్రస్తుత రాజకీయ అంశాలను కూడా ఈ సినిమాలో చర్చించినట్లు తెలుస్తోంది.
సంక్రాంతి రేసులో దళపతి!
జనవరి 9న విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు, తమిళం , హిందీ భాషల్లో సత్తా చాటనుంది. విజయ్ తన సినీ కెరీర్‌ను విజయంతో ముగిస్తారా? ‘జన నాయకుడు’ భగవంత్ కేసరిని మించి మెప్పిస్తుందా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే..
