తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో బీఆర్ఎస్​కు సంబంధం లేదు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో బీఆర్ఎస్​కు సంబంధం లేదు
  •     పెద్దపల్లి జడ్పీ చైర్మన్​ పుట్ట మధు కీలక వ్యాఖ్యలు
  •     అయోమయంలో యూనియన్​ క్యాడర్​

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో పనిచేస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకెఎస్​)తో బీఆర్ఎస్​ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్​ పుట్ట మధు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సింగరేణిలో బీఆర్ఎస్‌‌కు అనుబంధంగా ఏ యూనియన్ లేదన్నారు.

గతంలో తమకు అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్ ను డిసెంబర్​లో జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల టైంలో పార్టీ హైకమాండ్ ​పోటీకి దూరంగా ఉంచిందన్నారు. ఇటీవల ఓ వ్యక్తి టీబీజీకేఎస్​యూనియన్‌‌కు అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారని, ఆ కమిటీకి బీఆర్ఎస్ నుంచి ఎలాంటి అనుమతి లేదన్నారు. టీబీజీకేఎస్ యూనియన్ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో ముఖ్య లీడర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, వారి కారణంగానే గోలేటి నుంచి సత్తుపల్లి వరకు సింగరేణి ఏరియా వ్యాప్తంగా ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాల్లో బీఆర్ఎస్​ అభ్యర్థులు ఓడిపోయారన్నారు.

సింగరేణిలో టీబీజీకేఎస్ ​లేదని, ఉన్నా బీఆర్ఎస్​తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సింగరేణి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీబీజీకేఎస్​ యూనియన్​ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త కమిటీతో తెరమీదకు వచ్చింది. తమ యూనియన్​ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగానే కొనసాగుతామని ముందు ప్రకటించినా, తర్వాత బీఆర్ఎస్​తోనే తాము ఉంటామని నాయకత్వం ప్రకటించింది.

దీనికి కొనసాగింపుగా ఇటీవల జరిగిన లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్​కు మద్దతు తెలుపుతూ ఆయన గెలుపు కోసం టీబీజీకేఎస్​ లీడర్లు గనులపై ప్రచారం కూడా చేశారు. అయితే, తాజాగా బీఆర్ఎస్​కు టీబీజీకేఎస్​కు ఎలాంటి సంబంధం లేదని జడ్పీ చైర్మన్​ పుట్ట మధు ప్రకటించడం ఆ యూనియన్ ​శ్రేణులను అయోమయానికి గురి చేసింది.