- హంగ్ మున్సిపాలిటీలను వదులుకోవద్దని ఆదేశం
- నిజామాబాద్ బాధ్యతలు మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేశ్‌కు
- మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌కు కరీంనగర్ బాధ్యతలు
- కొత్తగూడెం కార్పొరేషన్ సస్పెన్స్ కు తెర.. మేయర్ పదవి సీపీఐకి ఇచ్చి డిప్యూటీ పదవి తీస్కోవాలని నిర్ణయం
- మేయర్, చైర్పర్సన్ల ఎన్నికల దాకా అలర్ట్ గా ఉండాలని ఆదేశం
- కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించాం
- పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అభినందనలు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ గెలిచే అవకాశమున్న హంగ్ మున్సిపాలిటీలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని, కలిసి వచ్చే ఇండిపెండెంట్లు, ఎక్స్అఫీషియో ఓట్లతో చైర్పర్సన్ స్థానాలు దక్కించుకోవాలని మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా హంగ్ ఏర్పడినకరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం
కార్పొరేషన్లను ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దన్నారు. నిజామాబాద్‌లో కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులను సమన్వయం చేసుకునే బాధ్యతలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు.. కరీంనగర్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌కు సీఎం అప్పగించారు. ఆయా చోట్ల మేయర్, చైర్పర్సన్ఎన్నికలు జరిగే వరకు అప్రమత్తంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు. మరోవైపు కొత్తగూడెం కార్పొరేషన్ సస్పెన్స్‌కు సీఎం రేవంత్ తెరదించారు. ఇక్కడ 60 డివిజన్లకుగాను సీపీఐకి 22, కాంగ్రెస్‌కు 22 చొప్పున సీట్లు దక్కాయి. ఈ మేరకు శుక్రవారమే ఎమ్మెల్యే కూనంనేనితో మాట్లాడిన సీఎం, శనివారం సీపీఐ రాష్ట్ర నేత పల్లా వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. మొదటి రెండున్నరేళ్లు మేయర్ పదవి సీపీఐకి ఇచ్చి డిప్యూటీ పదవి కాంగ్రెస్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేయర్ ఎన్నికకు సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సీఎం అప్పగించారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో సమన్వయం చేసుకోవాలని.. ఆదివారం మధ్యాహ్నంలోపు ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. శనివారం సాయంత్రం సీఎం జూబ్లీహిల్స్ లోని తన కార్యాలయంలో ఈ మేరకు మంత్రులతో భేటీ అయ్యారు.
ఇందులో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ హాజరయ్యారు. జూమ్ ద్వారా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.
అభివృద్ధిని ప్రజలు గుర్తించారు
రెండేళ్లలో కాంగ్రెస్ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తించి, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అభివృద్దిని మనం కేవలం రెండేళ్లలోనే చేసి చూపించాం. ప్రజాపాలనను అందిస్తూ అన్ని వర్గాలవారి ఆదరాభిమానాలు చూరగొంటున్నాం. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో మరింత ప్రజారంజకంగా ముందుకెళ్దాం’’ అని సీఎం చెప్పినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన మంత్రులను రేవంత్ అభినందించారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా ఉన్న మంత్రులు.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులను సమన్వయం చేసుకుంటూ పక్కా వ్యూహంతో ప్రచారం చేసి, పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, రాబోయే రోజుల్లో ఎన్నికలు ఏవైనా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలను ఈ సందర్భంగా సీఎం అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు చెప్పారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంపై మంత్రులు దృష్టిపెట్టాలన్నారు.
క్యాతనపల్లి, బెల్లంపల్లి బాధ్యతలు మంత్రి వివేక్‌కు
మంత్రులతో భేటీ అనంతరం సీఎంను సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి కలిశారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కూడా ఇందులో పాల్గొన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకోవాలని.. ఇందుకు ప్రతిగా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో సీపీఐ కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని నిర్ణయించినట్టు సమాచారం. క్యాతనపల్లి మున్సిపాలిటీతో పాటు బెల్లంపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకునేలా చూడాలన్న సీఎం.. ఈ బాధ్యతలను మంత్రి వివేక్ వెంకటస్వామికి అప్పగించారు. ఇక జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ వర్గాలు తమ కౌన్సిలర్లతో వేర్వేరు క్యాంపులు నిర్వహిస్తుండడంతో వారిని సమన్వయం చేసే బాధ్యతలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కు సీఎం అప్పగించారు.
