- భువనగిరి.. మోత్కూరు.. చౌటుప్పల్‌లో ఉత్కంఠ
- పరిశీలనలో పలువురి పేర్లు
- క్యాంపులోనే కొనసాగుతున్న కౌన్సిలర్లు
యాదాద్రి, వెలుగు : మున్సిపాలిటీల ఫలితాలు వచ్చేశాయి. పార్టీల బలాబలాలు తేలిపోయాయి. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. కౌన్సిలర్లు అందరూ క్యాంపుల్లోనే ఉన్నారు. చైర్పర్సన్ల ఎంపికపై కసరత్తు సాగుతోంది. ఎక్స్అఫిషియో ఓట్లు అవసరం లేకుండానే చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎంపిక జరగనుంది.
ఎన్నికలకు మందే జిల్లాలోని ఆలేరు, యాదగిరిగుట్ట, భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీల్లో చైర్పర్సన్స్లను డిక్లేర్ చేశారు. ఆలేరు చైర్‌పర్సన్‌గా బీజని బాలమణి, యాదగిరిగుట్టకు గుండ్లపల్లి వాణి, భూదాన్ పోచంపల్లికి తడక వెంకటేశ్‌ను ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. వీటిలో యాదగిరిగుట్ట వైస్ చైర్‌పర్సన్‌గా ముక్కర్ల మల్లేశ్‌ను ప్రకటించారు. ఆలేరు వైస్ చైర్మన్‌గా ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీ నుంచే ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. భూదాన్ పోచంపల్లి వైస్చైర్మన్ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది.
ఆ మూడింటిలో ఎవరో..
భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్పర్సన్పదవులు జనరల్మహిళకు, మోత్కూరు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. భువనగిరిలో 35, 29 వార్డుల కౌన్సిలర్లు తంగెళ్లపల్లి శ్రీవాణి, పోతంశెట్టి మంజులతో పాటు 11 వ వార్డు కౌన్సిలర్ గంజి శ్రీవాణి సహా మరికొందరు ఆశిస్తున్నారు. జనరల్మహిళ అయినందున ఓసీకి ఇవ్వాలా..? బీసీకి ఇవ్వాలా అన్న అంశంపై చర్చ నడుస్తోంది. చైర్‌పర్సన్ ఎంపికపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చౌటుప్పల్ మున్సిపాలిటీ కూడా జనరల్ మహిళ అయినందున కాసర్ల మంజుల రెడ్డి, బీసీ సామాజిక వర్గాల నుంచి మోగుదాల పావని, బత్తుల వాణి విప్లవ్ ఆశిస్తున్నారు.
ఈ ముగ్గురిలో చైర్‌పర్సన్ పదవికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎవరిని ఎంపిక చేస్తారన్న అంశంపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అదే విధంగా ఆయా మున్సిపాలిటీల్లో వైస్ చైర్పర్సన్ల ఎంపికపై చర్చలు నడుస్తున్నాయి. మోత్కూరు చైర్‌పర్సన్ పదవి కోసం రిజర్వ్వార్డు నుంచి 2వ వార్డు కౌన్సిలర్ కుర్మిల్ల ప్రమీల, 6వ వార్డు గడ్డం స్వప్న, జనరల్ వార్డు 12 నుంచి గెలిచిన మెంట రమణ ఆశిస్తున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. చైర్‌పర్సన్‌గా గడ్డం స్వప్న, వైస్ చైర్‌పర్సన్‌గా గా శ్రీవిద్యను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే మందుల సామెల్ భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి మాత్రం చైర్ పర్సన్‌గా మెంట రమణ, వైస్ చైర్‌పర్సన్‌గా బీసు శ్రీకాంత్‌ను సూచిస్తున్నట్టుగా కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.
కౌన్సిలర్లు అందరూ క్యాంప్‌లోనే
పోచంపల్లి మున్సిపాలిటీలో గెలిచిన ఇండిపెండెంట్ కూడా కాంగ్రెస్ క్యాంపులో చేరిపోయారు. దీంతో అక్కడ కూడా ఎక్స్అఫిషియో ఓటు అవసరం లేకుండానే చైర్‌పర్సన్ ఎన్నిక జరగనుంది. ఆరు మున్సిపాలిటీలకు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ క్యాంపులోనే కొనసాగుతున్నారు. వీరందరూ ఈ నెల 16న నేరుగా ఆయా మున్సిపాలిటీలకు వచ్చి చైర్మన్ ఎన్నిక కోసం నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.
