- కార్పొరేటర్లు, కౌన్సిలర్లను రిసార్టులకు తరలించిన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్
- ముగ్గురు ఇండిపెండెంట్లు, ఏఐఎఫ్బీ కార్పొరేటర్ సపోర్ట్ తో మ్యాజిక్ ఫిగర్ చేరిన బీజేపీ
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో గెలిచిన కార్పొరేటర్లు క్యాంపుల బాటపట్టారు. మేయర్ కుర్చీ లక్ష్యంగా బీజేపీ తమ కార్పొరేటర్లు, ఇండిపెండెంట్లతో హైదరాబాద్ శివారులోని రిసార్ట్‌లో క్యాంపు నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిని కాపాడుకునేందుకు ఆ పార్టీలు కూడా క్యాంపులు నిర్వహిస్తున్నాయి. దీంతో కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరిని వరిస్తాయోనని జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
అలాగే, జమ్మికుంటలో మున్సిపాలిటీలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, కాంగ్రెస్, బీఆర్ఎస్ క్యాంపుల్లో మ్యాజిక్ ఫిగర్ కు తగినట్లు కౌన్సిలర్లు లేకపోవడంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై సస్పెన్స్ నెలకొంది.
ఫలించిన కేంద్ర మంత్రి సంజయ్ వ్యూహం
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 30 సీట్లకే బీజేపీ పరిమితమైంది. మ్యాజిక్ ఫిగర్ కు మరో 5 సీట్లు అవసరం ఉండటంతో కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మేయర్ సునీల్ రావు వెంటనే ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల కార్పొరేటర్లపై దృష్టి సారించారు. ఫలితాలు వెలువడిన కొద్దిసేపట్లోనే శుక్రవారం రాత్రి 13వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ తెల్ల లక్ష్మి, 15వ డివిజన్ ఏఐఎఫ్ బీ కార్పొరేటర్ విపల సాయిజ్యోతి కేంద్ర మంత్రి సమక్షంలో బీజేపీలో చేరారు. 17వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్, 39వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్(బీజేపీ రెబల్) మాసం గణేశ్ హైదరాబాద్ లోని బీజేపీ క్యాంపునకు చేరుకున్నారు.
వీరికి కేంద్ర మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నలుగురి చేరికతో బీజేపీ బలం 34కు చేరింది. స్థానిక ఎంపీగా బండి సంజయ్ కి ఎక్స్ అఫీషియో ఓటు ఉన్నందున ఆ సంఖ్య 35కు చేరింది. దీంతో మేయర్ పదవి బీజేపీకే దక్కనుంది. ఈ పార్టీతో మరో ఆరుగురు కార్పొరేటర్లు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ 14, బీఆర్ఎస్10 మందిని..
కాంగ్రెస్ నుంచి గెలిచిన 14 మంది కార్పొరేటర్లతో పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ చార్జి వెలిచాల రాజేందర్ రావు హైదరాబాద్ లో క్యాంపు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన 9 మందితోపాటు రెబల్ గా గెలిచిన ఇండిపెండెంట్ ఆ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో క్యాంపులో ఉన్నారు. తమవారు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ఈ రెండు పార్టీలు క్యాంపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరోవైపు బీజేపీలో చేరిన ఏఐఎఫ్బీ కార్పొరేటర్ విపల సాయిజ్యోతికి విప్ జారీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి తెలిపారు. ఆమె ఎన్నిక రద్దయ్యే వరకు లీగల్ గా ఫైట్ చేస్తామని పేర్కొన్నారు.
జమ్మికుంటలో సస్పెన్స్..
జమ్మికుంట మున్సిపాలిటీ లో 30 వార్డులు ఉండగా.. 12 బీఆర్ఎస్, 10 కాంగ్రెస్, 4 బీజేపీ, ఒక స్థానాన్ని ఏఐఎఫ్ బీ గెలుచుకున్నాయి. 3 చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. అయితే, ఫలితాలు వెలువడగానే 10 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ముగ్గురు ఇండిపెండెంట్లు, ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్, ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ ను కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ శివారులోని రిసార్ట్‌కు తీసుకెళ్లారు.
15 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ క్యాంపులో ఉండగా.. బీఆర్ఎస్ క్యాంపులో 11 మంది ఉన్నారు. మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఓటుతో కలిపి 31 కాగా.. మ్యాజిక్ ఫిగర్ 16 అవుతుంది. ప్రస్తుతానికి ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోకపోవడంతో చైర్మన్ పీఠం విషయంలో సస్పెన్స్ నెలకొంది.
జగిత్యాలలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గాలు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. 23 వార్డులను గెలిచిన కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ.. చైర్‌పర్సన్ పదవిపై పార్టీలోని రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం విడివిడిగా తమ అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానానికి పంపాయి. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సపోర్ట్‌తో గెలిచిన 14 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 7గురు ఇండిపెండెంట్లు హైదరాబాద్ క్యాంప్‌నకు తరలివెళ్లారు.
జీవన్ రెడ్డి వర్గం నుంచి గెలిచిన 9 మంది కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు ఆయన మద్దతుతో గెలిచిన మరో 8 మంది ఇండిపెండెంట్లు ఆయనవైపే ఉన్నారు. వీరిలో 14 మందిని శనివారం సాయంత్రం హైదరాబాద్ క్యాంప్‌నకు తరలించినట్లు తెలిసింది. మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వారికే చైర్‌పర్సన్ పదవి ఇవ్వాలని జీవన్‌రెడ్డి డిమాండ్చేస్తున్నారు.
