బొడ్రాయికి పైసలియ్యలేదని 20 కుటుంబాలు వెలి

బొడ్రాయికి పైసలియ్యలేదని 20 కుటుంబాలు వెలి
  •      వారికి సహకరిస్తే ఇదే గతి పడుతుందని హెచ్చరిక 
  •     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వడ్డెరంగాపురంలో ఘటన

అశ్వారావుపేట, వెలుగు: గ్రామంలో బొడ్రాయిని ఏర్పాటు చేసేందుకు డబ్బులు ఇవ్వలేదంటూ గ్రామ పెద్దలు 20 కుటుంబాలను వెలివేశారు. బాధితుల కథనం ప్రకారం.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వడ్డె రంగాపురం గ్రామానికి చెందిన చల్లా దుర్గయ్య కుటుంబంతో పాటు మరో 19 కుటుంబాలు ఓ మతాన్ని స్వీకరించాయి. అయితే, గ్రామంలో బొడ్రాయి ఏర్పాటు చేస్తున్నామని గ్రామ పెద్దలు పల్లపు అప్పారావు, గండికోట మహా లక్ష్మయ్య, వల్లపు శ్రీను, డేరంగుల దుర్గయ్య, గంజి లక్ష్మయ్య వెళ్లి సదరు కుటుంబాలను డబ్బులు అడిగారు.

అయితే, అది తమ మత విశ్వాసాలకు వ్యతిరేకమని, డబ్బులను ఇవ్వలేమని సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు ఆ కుటుంబాలను వెలివేశారు. ఆ 20 కుటుంబాలతో ఎవరైనా మాట్లాడినా,  గ్రామంలో నిత్యావసర సరుకులు ఇచ్చినా, బంధువులు వాళ్ల ఇండ్లకు వెళ్లినా రూ.5 వేల జరిమానాతో పాటు వారిని కూడా వెలి వేస్తామని హెచ్చరించారు.  దీంతో బాధితులు బుధవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామని ఎస్సై శ్రీరాముల శ్రీను తెలిపారు.