- రిపేర్ పేరిట స్కానింగ్ సెంటర్ క్లోజ్
- ప్రైవేట్ ల్యాబ్‌లతో కుమ్మక్కై ఈ పనిచేసినట్లు ఆరోపణ
- ప్రైవేట్ ప్రాక్టీస్‌కు మొగ్గు చూపుతున్న కొందరు డాక్టర్లు
- గోదావరిఖనిలో హాస్పిటల్‌లో సరిగా అందని వైద్యసేవలు
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని జనరల్ హాస్పిటల్‌లో అంతా ప్రైవేట్ దందా సాగుతోంది. రిపేర్ పేరిట స్కానింగ్ సెంటర్ మూసేశారు. ఇదే అదునుగా కొందరు డాక్టర్లు, ల్యాబ్ సిబ్బంది కుమ్మక్కై ఫలానా ఈ ప్రైవేట్ ల్యాబ్‌కు వెళ్లి స్కానింగ్ చేయించుకోమని రెఫర్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇలా రెఫర్ చేయడంతో సదరు ల్యాబ్ నిర్వాహకులు రోగులను దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీలో కొందరు ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బందికీ వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తుండడంతో సర్కార్ హాస్పిటల్‌కు వచ్చే రోగులకు సరైన వైద్యం అందడం లేదు.
రోజుకు 1200 మంది ఓపీ
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు అనుబంధంగా సింగరేణి మెడికల్‌కాలేజీ ఉంది. ఈ హాస్పిటల్‌కు గోదావరిఖనితో పాటు రామగుండం, ఎన్టీపీసీ, యైటింక్లయిన్ కాలనీ, మంథని, చెన్నూర్, శ్రీరాంపూర్, కమాన్‌పూర్, బేగంపేట, తదితర ప్రాంతాల నుంచి ప్రతి రోజు సుమారుగా 1200 మంది ఔట్ పేషంట్లు వస్తుంటారు. మెడికల్‌కాలేజీకి అనుబంధంగా హాస్పిటల్నడుస్తున్నప్పటికీ రోగులకు సేవలు మాత్రం అంతంత మాత్రంగానే అందుతున్నాయి. సింగరేణి మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉంటూ జనరల్ హాస్పిటల్‌లో వైద్య సేవలందించాల్సిన కొందరు డాక్టర్లు.. హాస్పిటల్‌లో రెగ్యులర్‌గా డ్యూటీకి రాకుండా ప్రైవేటు ప్రాక్టీస్‌కే మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల పేషంట్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మానసిక వ్యాధి, చర్మవ్యాధి, ఛాతికి సంబంధించిన రోగులను చూసే వైద్యులతో పాటు పలు విభాగాలకు చెందిన డాక్టర్లు విధులకు గైర్హాజరు అవుతూ ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తున్నారనే విషయంపై కొందరు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇలా డ్యూటీలకు డుమ్మా కొట్టి ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న వారి పట్ల అంతర్గతంగా ఓ బృందం ప్రత్యేక పరిశీలన చేస్తున్నట్టు సమాచారం.
ప్రైవేట్‌లోనే స్కానింగ్
గోదావరిఖని గవర్నమెంట్జనరల్ హాస్పిటల్‌లోని స్కానింగ్సెంటర్గది దర్వాజ, తలుపులకు చెదలు పట్టడంతో రిపేర్ చేసేందుకని కొద్దిరోజులుగా మూసివేశారు. అయితే స్కానింగ్అవసరమైన రోగులకు అత్యవసరమైతే పక్కనే ఉండే మరో గవర్నమెంట్హాస్పిటల్లో స్కానింగ్ చేయించుకొని రావాలంటూ రెఫర్చేయాలి. కానీ పట్టణంలోని లక్ష్మీనగర్‌లో ఉన్న ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లో స్కానింగ్ చేసుకొని రావాలంటూ చిట్టీలు రాసిచ్చి పంపుతున్నారు. దీంతో ఒక్కో రోగికి కనీసం రూ. 5 వేల దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ దోపిడీలో డాక్టర్లకు, సిబ్బందికి.. ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులతో ఆర్థిక లావాదేవీలు ఉండడం వల్లే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
డోర్లకు చెదపట్టినందునే..
గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో స్కానింగ్ సెంటర్ డోర్లు చెదలు పట్టాయి. వాటిని తొలగించి రేడియేషన్ ప్రూఫ్ డోర్లను బిగిస్తున్నారు. దీంతో నాలుగు రోజులుగా స్కానింగ్ సెంటర్‌ను క్లోజ్ చేశారు. మరో మూడు రోజుల్లో పని పూర్తవుతుంది. ఎవరైనా పేషెంట్‌కు స్కానింగ్ అత్యవసరమైతే ప్రైవేట్ ల్యాబ్‌కు పంపించి ఉండవచ్చు. దీనిపై విచారణ చేస్తాం.
-డాక్టర్ కృపాబాయి, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్
