వరంగల్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ..  పనుల కోసం రూ.5 వేల కోట్లు విడుదల

వరంగల్ కు  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ..  పనుల కోసం రూ.5 వేల కోట్లు విడుదల
  • ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో పనులు షురూ
  • 4 ప్యాకేజీలు, 9 జోన్లు, 13 సబ్ జోన్లలో పనులు
  • 2.92 లక్షల ఇండ్లకు సీవరేజీ కనెక్షన్లు
  • మురుగునీటి శుద్ధికి 23 ఎస్టీపీల ఏర్పాటు

వరంగల్, వెలుగు: రాష్ట్ర రాజధాని తర్వాత అతిపెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్‌‌‌‌‌‌‌‌లో మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్ డ్రైనేజీ(యూడీఎస్​) ప్రాజెక్టుకు ఎట్టకేలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,257.20 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో మొదటి దశ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టును 4 ప్యాకేజీలు, 9 జోన్లు, 13 సబ్‌‌‌‌‌‌‌‌జోన్లుగా విభజించి చేపట్టనున్నారు. వచ్చే 2, 3 ఏండ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2025 నాటికి గ్రేటర్ వరంగల్ జనాభా 11,24,336 కాగా, 2057 నాటికి 22 లక్షలకు పెరుగుతుందని అంచనా. దీనిని దృష్టిలో పెట్టుకుని మొత్తం 2,739 కిలోమీటర్ల యూడీసీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ నిర్మించనున్నారు.

సీఎం ఇచ్చిన హామీ ప్రకారం..

వరంగల్‌‌‌‌‌‌‌‌లో యూడీఎస్​ ప్రతిపాదనను 1995లో అప్పటి కేంద్ర మంత్రి జైపాల్​రెడ్డి ముందుకు తీసుకువచ్చినా తరువాత ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఇది రాజకీయ హామీగానే మిగిలింది. తాజాగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో వరంగల్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి యూడీసీ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ వెంటనే డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డితో పాటు ఎంపీ కడియం కావ్య, గ్రేటర్‍ పరిధి ఎమ్మెల్యేలు కొండా సురేఖ, కేఆర్‍.నాగరాజు, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, మేయర్‍ సుధారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‍ అధికారులను సమన్వయం చేస్తూ ప్రణాళిక సిద్ధం చేయడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

2.92 లక్షల ఇండ్లకు కనెక్షన్లు..

గ్రేటర్ వరంగల్ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 66 డివిజన్లు, 42 విలీన గ్రామాల్లో విస్తరించి ఉంది. మొత్తం 407.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 3,137 కి.మీ. రోడ్లు ఉన్నాయి. పక్కా డ్రైన్​ 882.20 కి.మీ., కచ్చ డ్రైన్​ 1897.80 కి.మీ., వరద నీటి కాలువలు 99.80కి.మీ. కలిపి మొత్తంగా 2,780 కి.మీ. డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఈ క్రమంలో జీడబ్ల్యూఎంసీ అధికారులతో కలిపి రాజస్థాన్‍కు చెందిన ఎన్‍.కే.బిల్డ్​కాన్‍ ప్రైవేట్‍ లిమిటెడ్‍ సంస్థ యూడీఎస్​ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్‍ రెడీ చేసింది. 2027 నాటికి నగరంలోని 2,92,194 ఇండ్లకు సీవరేజీ కనెక్షన్లు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు.

మురుగునీటి శుద్ధికి 23 ఎస్టీపీలు..

నగరంలోని మురుగునీటిని శుద్ధి చేయడానికి సీవేజ్ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)లు కీలకం కానున్నాయి. ప్రస్తుతం 20 ఎంఎల్‌‌‌‌‌‌‌‌డీ సామర్థ్యం ఉన్న రెండు ఎస్టీపీలు ఉండగా, మరో 204 ఎంఎల్‌‌‌‌‌‌‌‌డీ సామర్థ్యంతో 21 కొత్త ఎస్టీపీలు నిర్మించనున్నారు. మొత్తం 23 ఎస్టీపీలు, 7 సీవేజ్ పంపింగ్ స్టేషన్లు, 12 కమ్యూనిటీ స్టెబిలైజేషన్ ట్యాంకులతో యూడీసీ వ్యవస్థ పనిచేయనుంది. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలు, నగర పచ్చదనం కోసం వినియోగించనున్నారు.

మొదటి దశలో వర్ధన్నపేట నియోజకవర్గంలో..

అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ పనులు 9 జోన్లు, 13 సబ్‍ జోన్ల పరిధిలో చేపడుతుండగా.. ప్రారంభం మాత్రం వర్ధన్నపేట నియోజకవర్గంలోని జోన్‍ 1 పరిధిలోని ఉనికిచర్ల, దేవన్నపేట, చింతగట్టు, హసన్‍పర్తి తదితర ప్రాంతాల్లో చేపట్టనున్నారు. తరువాత దశలవారీగా ఇతర జోన్లలో పనులు విస్తరించనున్నాయి. దీంతో వరంగల్ నగరంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.