- పది రోజులు మూసివేయాలని కొందరు ఓనర్ల నిర్ణయం
- ఐపీఎల్, ఎగ్జామ్స్, ఎలక్షన్స్ టైమ్ కావడంతో తగ్గిన ఆక్యుపెన్సీ
- పెద్ద సినిమాలు రాక, చిన్న సినిమాలు మెప్పించక నష్టాలు
- నెలకు రూ.5 లక్షల ఖర్చు.. కలెక్షన్లు మాత్రం రూ.2 లక్షలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ టాకీసులు పది రోజుల పాటు బంద్ కానున్నాయి. కొద్ది రోజులుగా ఆక్యుపెన్సీ తగ్గడం, ఖర్చులు పెరగడంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు తమ టాకీసులను మూసివేయనున్నట్టు కొందరు ఓనర్లు బుధవారం ప్రకటించారు. తెలంగాణలో 800, ఆంధ్రాలో 1,200 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉండగా.. వీటిలో 50 శాతం దాకా మూతపడే అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే ఈ నిర్ణయం కలెక్షన్స్లేని థియేటర్లఓనర్లు తీసుకున్నది మాత్రమే. టాకీసులు బంద్ చేయాలని ఏ అసోసియేషన్పిలుపునివ్వలేదు. మల్టీప్లెక్స్ లు మాత్రం ఎప్పటిలాగే నడవనున్నాయి.
పెద్ద సినిమాల్లేవ్..
సాధారణంగా ప్రతి సమ్మర్ లో పెద్ద సినిమాల రిలీజ్ కు నిర్మాతలు ప్లాన్ చేసుకుంటారు. ఆ టైమ్‌లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉంటాయి కాబట్టి థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోతాయి. కానీ ఈ ఏడాది పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాలేదు. రిలీజైన చిన్న సినిమాలు జనాలను మెప్పించలేకపోతున్నాయి. దీంతో జనాలు లేక థియేటర్స్ వెలవెలబోతున్నాయి. మరోవైపు నెల రోజులుగా ఎలక్షన్ ఫీవర్, ఐపీఎల్ సీజన్ కావడంతో యూత్ ఎక్కువగా టీవీలకు అతుక్కుపోవడం, ఇంకోవైపు ఎగ్జామ్స్ కూడా ఉండడం థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గడానికి కారణమని కొందరు ఓనర్లు చెబుతున్నారు.
ఒక్కో షోకు 5 వేల నష్టం..
సాధారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్క షోను రన్ చేయడానికి రూ.15 వేల దాకా ఖర్చవుతుంది. కానీ ఒక్క షోకు కనీసం వంద టికెట్లు కూడా అమ్ముడుపోవడం లేదని, టికెట్ల ద్వారా రూ.10 వేలు కూడా రావట్లేదని థియేటర్ల యజమానులు చెబుతున్నారు. ప్రతి షోకు రూ.5 వేలు నష్టపోతున్నామని వాపోతున్నారు. ఇక ప్రతి నెల సిబ్బందికి జీతాలు, కరెంట్ బిల్లులు, మెయింటెనెన్స్ ఇలా అన్నీ కలిపి రూ.5 లక్షల దాకా ఖర్చవుతున్నాయని.. కలెక్షన్లు మాత్రం రూ.2 లక్షలు కూడా దాటట్లేదని అంటున్నారు. నష్టాలతో థియేటర్లను నడపలేకపోతున్నామని, అందుకే పది రోజులు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
ఖర్చులు భరించలేకనే...
చిన్న సినిమాలకు కలెక్షన్లు రావడం లేదు. పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. దీంతో ఆక్యుపెన్సీ తగ్గింది. ఖర్చు లు భరించలేకనే థియేటర్లు బంద్పెడుతున్నం. మండల కేంద్రాల్లోని థియేటర్లలో ఒక్క షోను రన్ చేయడానికి రూ.10 వేల నుంచి రూ.12 వేలు, హైదరాబాద్ లాంటి సిటీల్లో రూ.15 వేల నుంచి రూ.18 వేలు ఖర్చవుతుంది. కానీ టికెట్ల ద్వారా అంతమొత్తం రావడం లేదు. నిర్మాతలు ముందుకొచ్చి ఖర్చులు భరిస్తే థియేటర్లు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం. బంద్‌కు ఏ అసోషియేషన్ పిలుపునివ్వలేదు. మేమే సొంతంగా నిర్ణయం తీసుకున్నం.
‑ విజయేందర్‌రెడ్డి, ఎగ్జిబిటర్స్ కంట్రోలర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్
కొన్ని షోలు రద్దు..
థియేటర్లను బంద్ పెట్టడం ఓనర్ల ఇష్టం. నష్టాల్లో ఉన్నవారు బంద్ పెడుతున్నరు. సోమవారం నుంచి బంద్ ఉండే అవకాశం ఉంది. మొత్తం బంద్ పెట్టకపోయినా మార్నింగ్, మాట్నీ ఇలా ఆక్యుపెన్సీ తక్కువగాఉండే షోలను రద్దు చేయొచ్చు. జనాలు ఎక్కువ లేనప్పుడు ఏం చేయలేం.
‑ సదానందం గౌడ్, అలంకార్ థియేటర్ ఓనర్, లంగర్ హౌస్
రాబోయే సినిమాలపైనే ఆశలు..
కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు పది రోజులు మూతపడే అవకాశం ఉంది. ఎన్నికల వల్ల జనం థియేటర్లకు రాకపోవడం, ఇటీవల విడుదలైన సినిమాలు ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఓనర్లపై భారం పడుతున్నది. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు విడుదల కాకపోవడంతో నష్టాలు పెరిగిపోతున్నాయి. కొత్త సినిమాలు వచ్చేంత వరకు థియేటర్లు బంద్ చేయాలన్న ఆలోచనలో సింగిల్ స్ర్కీన్థియేటర్ల యజమానులు ఉన్నారు. సమ్మర్ సీజన్ లో ఎప్పుడూ రష్ గా ఉండే థియేటర్లు ఈసారి బోసిపోయాయి. పది రోజుల్లో కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. వాటి మీదే ఆశలు పెట్టుకున్నాం.
‑గోవింద్ రాజు, సుదర్శన్ థియేటర్ యజమాని, ఆర్టీసీ క్రాస్ రోడ్స్