H1B వీసాలు నిలిపివేసే ఆలోచనలో ట్రంప్ ప్రభుత్వం

H1B వీసాలు నిలిపివేసే ఆలోచనలో ట్రంప్ ప్రభుత్వం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B  వీసాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కరోనా విజృంభన, లాక్ డౌన్ తో దేశంలో నిరుద్యోగుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. దీంతో పాటు వలసలను నిరోధించడానికి H1B సహా పలు రకాల వర్క్‌ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించనున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు, ఉద్యోగాల్లో అమెరిన్లకే ప్రాధాన్యత లభిస్తుందని ట్రంప్ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం.

H1B వీసాతో సహా ఇతర వర్క్ వీసాలను నిలిపివేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్‌ తెలిపింది. ప్రతిపాదిత సస్పెన్షన్ కొత్త ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నుంచి ఉండనుందని గురువారం నివేదించింది. హెచ్ 1బీ వీసాతో పాటు, హెచ్ 2బీ వీసా, జే1, ఎల్1 వీసాలను కూడా నిలిపివేయవచ్చు, దీంతో సుమారు లక్ష మందికి పైగా ఎఫెక్ట్ కానున్నారని తెలిపింది. అయితే ఇప్పటికే హెచ్1బీ వీసా ఉన్నవారికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం లేదని చెప్పింది. ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే ఈ నిషేధం ఎత్తివేసేంతవరకు భారతీయ ఐటీ నిపుణుల ‘గ్రేట్ అమెరికన్ డ్రీం’కు చెక్ పడినట్టేననే ఆందోళన వ్యక్తమవుతోంది.

అలాగే H1B వీసా దరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుండి 20వేల డాలర్లకు పెంచే ప్రతిపాదనను కూడా ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతోపాటు ఒబామా తీసుకొచ్చిన  హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అనుమతినిచ్చే H4 వీసాలపై కూడా  బ్యాన్ విధించాలని  భావిస్తోందట.