వేములవాడ, వెలుగు: ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు వాటిని సమానంగా స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో నాలుగు రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు గురువారం ముగిశాయి.
ముఖ్య అతిథిగా హాజరైన విప్ ఆది శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేశారు. బాలుర విభాగంలో ఖమ్మం జిల్లా మొదటి స్థానం, రంగారెడ్డి రెండో స్థానం, వరంగల్ మూడో స్థానం, ఆదిలాబాద్ నాలుగో స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ మొదటి స్థానం, వరంగల్ రెండో స్థానం, నల్గొండ మూడో స్థానం, హైదరాబాద్ నాలుగో స్థానం దక్కించుకున్నాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సీఎం కప్ పేరిట పోటీలను నిర్వహిస్తోందని, దాదాపు 45కి పైగా క్రీడలను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. వేములవాడలో క్రీడాకారుల కోసం 5 ఎకరాల స్థలం కేటాయించామని, స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పుల్కం రాజు, వైస్ చైర్పర్సన్ నరాల శేఖర్, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
