
పద్మారావు నగర్, వెలుగు: ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సనత్ నగర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. సనత్‌నగర్‌లోని బతుకమ్మ చౌరస్తాలో కర్ణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన 300 మంది నాయకులు తలసాని శ్రీనివాస్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఫలారం బండి మధు ముదిరాజ్, నగర ఉపాధ్యక్షుడు రాయికోడ్ శివకుమార్, నాయిని రవిరాజ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలను కప్పి ఆహ్వానించారు. అనంతరం అర్జున్ గౌడ్, కొండల గౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన పాటల సీడీను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో సనత్‌నగర్ సెగ్మెంట్ ను ఎంతో అభివృద్ది చేసుకున్నామన్నారు. ఆయన వెంట కార్పొరేటర్ కొలను లక్ష్మి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు కొలను బాల్ రెడ్డి, నాయకులు ఉన్నారు. ఈ నెల 25న పరేడ్ గ్రౌండ్‌లో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్‌తో కలిసి పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్టలోని గైదన్ బాగ్‌కు చెందిన రషీద్, షఫీ, అశ్వక్ ఆధ్వర్యంలో 25 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెస్ట్ మారేడ్ పల్లిలోని తలసాని ఇంటి వద్ద బీఆర్ఎస్ లో చేరారు.