‘నాలుగేండ్ల నిబంధన’తో అప్లికేషన్లను అడ్డుకోవద్దు.. కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశాలు

‘నాలుగేండ్ల నిబంధన’తో అప్లికేషన్లను అడ్డుకోవద్దు.. కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశాలు
  • రాష్ట్ర విద్యార్థులందరి నుంచి దరఖాస్తులు తీసుకోండి
  • అడ్మిషన్లు తుది తీర్పుకు లోబడి ఉంటాయని మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: అడ్మిషన్లకు ముందు వరుసగా నాలుగేండ్లు రాష్ట్రంలో చదివి ఉండాలనే నిబంధనతో సంబంధం లేకుండా ఎంబీబీఎస్‌‌, డెంటల్‌‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ విద్యార్థులందరి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని కాళోజీ హెల్త్​ యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది. నాలుగేండ్ల నిబంధనతో దరఖాస్తులను తిరస్కరించొద్దని స్పష్టం చేసింది. అయితే, అడ్మిషన్లు తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. 

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ పి.శ్యాంకోశీల ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్‌‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌‌, డెంటల్‌‌ కోర్సుల అడ్మిషన్ల కోసం కాళోజీ హెల్త్​ వర్సిటీ ఈ నెల 15న జారీ చేసిన నోటిఫికేషన్‌‌ను సవాల్‌‌ చేస్తూ పలువురు విద్యార్థులు వేసిన పిటిషన్లను బుధవారం (జులై 23) విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు దివాకర్‌‌రెడ్డి, బి.మయూర్‌‌రెడ్డి, జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. గతేడాది హైకోర్టు తీర్పు ప్రకారం అడ్మిషన్లు కొనసాగించేలా ఉత్తర్వులివ్వాలన్నారు. 

అడ్మిషన్‌‌కు ముందు నాలుగేండ్లు తెలంగాణలో చదివి ఉండాలన్న నిబంధన వల్ల రాష్ట్రానికి చెందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లోని మెరుగైన విద్య కోసం లేదా తల్లిదండ్రుల బదిలీ, ఇతరత్రా కారణాల వల్ల రెండేళ్లు వేరే ప్రాంతాల్లో చదివి తిరిగి తెలంగాణకు వస్తే ఇక్కడ స్థానిక కోటా కింద అడ్మిషన్లు నిరాకరించడం చెల్లదని, ఈ మేరకు హైకోర్టు తీర్పు ఉందని గుర్తుచేశారు. శాశ్వత నివాసం ఉన్న వారికి స్థానిక కోటా అడ్మిషన్లు కల్పించడానికి మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించినా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 

హైకోర్టు తీర్పు మేరకు అడ్మిషన్లు చేపడతామని ప్రభుత్వ హామీతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్నారు. అది పెండింగ్‌‌లో ఉండగా పాత నిబంధనల ప్రకారం అడ్మిషన్లు చేపట్టడం చెల్లదన్నారు. స్థానిక కోటా కింద అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించేలా ఆదేశించాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం హైకోర్టు గతేడాది ఇచ్చిన ఆదేశాల ప్రకారం దరఖాస్తులను స్వీకరించి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించాలని కాళోజీ యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.