వలస కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేయవద్దు: సుప్రీంకోర్టు

వలస కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేయవద్దు: సుప్రీంకోర్టు

లాక్‌డౌన్‌తో దేశంలో అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కష్టాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్రాలకు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. బస్సు, రైలు ప్రయాణాల్లో వలస కార్మికుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జీలు వసూలు చేయరాదని, రాష్ట్రాలు భరించాలని ఆదేశించింది. అంతేకాదు వలస కార్మికులకు బస్సులు, రైళ్లలో ఆహారం అందించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా రోడ్ల వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నవలస కార్మికులకు తక్షణమే సాయం అందించాలని  సుప్రీం కోర్టు సూచించింది. వలస కార్మికుల విషయంలో అనేక లోటుపాట్లను తాము గుర్తించామని తెలిపింది. రిజిస్ట్రేషన్, ట్రాన్స్ పోర్టేషన్‌తో పాటు ఆహారం మంచినీళ్లు అందించే ఏర్పాట్లలో లోపాలు గుర్తించామని సుప్రీంకోర్టు తెలిపింది.

మరోవైపు ఇప్పటివరకూ కోటి మంది వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. వలస కార్మికులను ఆలస్యంగా తరలించాల్సి రావడానికి గల కారణాలపై సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కరోనా వ్యాప్తి చెందకుండా చూడటంతో పాటు ఆసుపత్రుల్లో తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు కార్మికుల తరలింపులో ఆలస్యమైందని కేంద్రం తెలిపింది.