
- సింగరేణికి నేరుగా కేటాయింపులు చేయాలని డిమాండ్
- ఉద్యోగుల బెన్ఫిట్స్ను కొనసాగించాలని వినతి
- ప్రైవేటీకరణ ఆలోచన కేంద్రానికి లేదు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణిని ప్రైవేటీకరించొద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్రాన్ని కోరారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. బుధవారం లోక్ సభలో సింగరేణి ప్రైవేటీకరణ, ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల కొనసాగింపు, సంస్థను ప్రభుత్వ రంగంలోనే ఉంచే అంశాలను లేవనెత్తారు. తాను 15 లక్షల మంది ఓటర్లు ఉన్న పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి ఎన్నికయ్యానని, నియోజక వర్గంలో ఐదు లక్షల మంది సింగరేణి కార్మికులు ఉన్నారని ఆయన వివరించారు.
ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్ యూ) లు ఉపాధిని స్థిరపరుస్తాయని, అటువంటి పెద్ద సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం సింగరేణి చాలా కష్టాల్లో ఉందని, వాటి నుంచి బయటపడేలా సింగరేణికి నేరుగా కేటాయింపులు చేయాలని కోరారు. దాదాపు రూ.30 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని విడుదల చేస్తే మెజార్టీ కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు అందుతున్న బెన్ఫిట్స్ను కొనసాగించాలని, ఉద్యోగాల సంఖ్యను కొనసాగించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ప్రైవేటీకరణ ఆలోచన కేంద్రానికి లేదు: కిషన్రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. లోక్సభలో సింగరేణిపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం చెప్పారు. దేశంలోని ఏ బొగ్గుగనినీ ప్రైవేటు పరం చేయడం లేదన్నారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51శాతం, కేంద్రం వాటా 49శాతంగా ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఏడాదికి 10 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ ను సింగరేణికి ఇచ్చే అంశంలో కేంద్రం ప్రత్యేక చొరవ చూపిందన్నారు. 2015లో ఈ కేటాయింపు జరిగినా అటవీ అనుమతులు సహా వివిధ కారణాలతో ఈ మైన్లో పనులు ముందుకు సాగలేదన్నారు.