
హైదరాబాద్: వినాయక నిమజ్జనంలో డీజే, టపాసులు వాడొద్దని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. డీజేల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని.. నిమజ్జనం తర్వాత కొందరు చనిపోతున్నారని అన్నారు. డీజే, బ్యాండ్ సౌండ్‌పై డయల్ 100కు చాలా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. బుధవారం (సెప్టెంబర్ 3) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హాజరై మాట్లాడారు. వినాయక చవిత ఉత్సవాల కోసం హైద్రాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 20 వేల మంది సిబ్బంది కాకుండా బయట నుంచి కూడా పోలీస్ అధికారులు బందోబస్తు నిర్వహిస్తున్నారని తెలిపారు. గత 5 ఏళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనం ఎలా జరిగిందో అలానే ఈ సంవత్సరం కూడా అలానే చేస్తామన్నారు.
వినాయక నిమజ్జనం ఎలాంటి ఆటంకాలకు లేకుండా చూసేందుకు ఫ్లాగ్ మార్చ్‌లు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. కొన్ని ఏరియాల్లో గార్బేజ్ క్లియరెన్స్ చేయాలని.. ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తుందన్నారు. జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ పెట్టి వెంటనే చెత్తను తొలగించాలని సూచించారు.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది గణేష్ విగ్రహాల ఎత్తు పెరిగాయని.. చాలా చోట్ల విగ్రహాలు నిలబడి ఉన్నాయన్నారు. సైబరాబాద్, రాచకొండ పోలీసులు సహకరించాలన్నారు. ఖైరతాబాద్ గణేష్ దగ్గర స్థలం చిన్నగా ఉంటుంది కాబట్టి అందరూ సహకరించాలని.. వీఐపీ పాస్‌లు అందరికి ఇవ్వలేమని అన్నారు. పోలీసులు నిద్రహారాలు మాని విధులు నిర్వర్తిస్తున్నారని.. గణేష్ నిమజ్జనానికి అందరూ సహకరించాలని కోరారు.