- సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో విషాదం
సిద్దిపేట రూరల్, వెలుగు : అప్పుల బాధతో కొడుకు ఆత్మహత్య చేసుకోగా, అతడి అంత్యక్రియలు నిర్వహించిన కొద్దిసేపటికే గుండెపోటుతో తండ్రి చనిపోయాడు. ఈ ఘటన సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పెద్దెల్లి గారి నాగరాజు (43) అప్పుల బాధతో మంగళవారం మధ్యాహ్నం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబసభ్యులు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత ఇంటికి వచ్చిన నాగరాజు తండ్రి రాములు (68) అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌కు తరలించగా ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బుధవారం చనిపోయాడు.

