వెహికల్ అలవెన్స్ పంచాయతీల నుంచే ఇవ్వాలట

వెహికల్ అలవెన్స్ పంచాయతీల నుంచే ఇవ్వాలట
  • ఉత్తర్వులు జారీ చేస్తున్న జిల్లా పంచాయతీ అధికారులు
  • ప్రభుత్వ తీరుపై సర్పంచుల ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు మండల పరిషత్ ఆఫీసర్(ఎంపీవో)లకు ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వెహికల్​ను కేటాయించనుంది. అయితే ఈ వెహికల్ మెయింటెనెన్స్ కోసం అవసరమయ్యే నిధులను గ్రామ పంచాయతీల నుంచే సేకరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో నెల ఒక్కో గ్రామ పంచాయతీ రూ.20 వేలు ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్(డీపీవో)లు ఆయా జిల్లాల్లో ఉత్తర్వులు ఇస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ ఆర్డర్స్ ఇచ్చారు. “రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. అన్ని పంచాయతీల సర్పంచ్ లు అర్థం చేసుకొని అలవెన్స్ లు చెల్లించాలి” అని పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు కోరారు. 
నిర్ణయాన్ని వెనక్కి తీస్కోవాలె.. 
ఎంపీవో వెహికల్ అలవెన్స్ ను ఇచ్చేందుకు సర్పంచ్ లు అంగీకరించటం లేదు. ఇప్పటికే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఇస్తున్న నిధులు చాలా తక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు. ఈ నిధులతో కార్మికుల జీతాలు, ట్రాక్టర్, ట్యాంకర్ ఈఎంఐలు, అభివృద్ధి పనులు, స్ట్రీట్ లైట్స్ కరెంట్ బిల్లులు, గ్రీన్ బడ్జెట్ కట్టడానికే సరిపోవటం లేదని, ఇక డెవలప్ మెంట్ కు నిధులు ఎలా? అని వాపోతున్నారు. సర్పంచ్ లు చేసిన పనులకు బిల్లులను ప్రభుత్వం చాలా లేట్ గా విడుదల చేస్తోందని, అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్నారని, వీటి వడ్డీకే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంపీవోలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన వెహికల్ అలవెన్స్ ను గ్రామ పంచాయతీల నుంచి వసూలు చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, “అభివృద్ధి పనులను పరిశీలించడం ఆఫీసర్ల డ్యూటీ. అందుకే కలెక్టర్ ఫండ్ నుంచే అలవెన్స్ ఇవ్వాలి. ఇప్పటికే ఎంపీడీవో ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్, ఆర్ డబ్ల్యూఎస్ లో పంప్ ఆపరేటర్ కు రూ. 8 వేల చొప్పున ప్రతి నెలా రూ.16 వేలు ఇస్తున్నాం. ఈ నిధులే దారి మళ్లుతున్నాయి’’ అని మహబూబ్ నగర్ జిల్లా నుసురుల్లాబాద్ సర్పంచ్- ప్రణీల్ చందర్ అన్నారు.