కరోనా నివారణకు మరో వ్యాక్సిన్ సిద్ధమౌతోంది. రష్యా అభివృద్ది చేసిన స్పుత్నిక్-వి టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి కోరనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ శుక్రవారం తెలిపింది. స్పుత్నిక్-వి… భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ట్రయల్స్ తుది దశకు చేరుకోవడంతో ట్రయల్స్ నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ఈ సమీక్షా ప్రక్రియలో 2వ దశలో భద్రత సమాచారం, అదేవిధంగా మూడవ దశ ట్రయల్స్ సంబంధించిన తాత్కాలిక డేటాను అందిస్తామని, మూడవ దశ ఈ నెల 21కి పూర్తి కానుందని రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది. ఇది అనుమతి పొందితే… కరోనా వైరస్ నివారణకు సిద్ధమౌతున్న మూడవ వ్యాక్సిన్‌గా ఈ రష్యన్ టీకా నిలుస్తుంది. ఇప్పటికే భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలోని ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.

