
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ దక్కిన నేతలు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతుంటే.. మరోవైపు టికెట్ దక్కని నాయకులు వివిధ రీతుల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ నిరాకరించడంతో జేడీయూ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోపాల్ మండల్ పాట్నాలోని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కార్యాలయం దగ్గర ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.
తనకు టికెట్ కేటాయించాలంటూ అనుచరులతో కలిసి ఆయన ఆందోళన చేశాడు. ఇదిలా ఉండగానే తాజాగా ఇలాంటి తరహా ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఆర్జేడీ సీనియర్ నాయకుడు మదన్ షా పాట్నాలోని పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం ముందు నిరసన చేపట్టాడు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో బోరున విలపిస్తూ బట్టలు చించుకుని ఆందోళన వ్యక్తం చేశాడు.
మదన్ షా ఆర్జేడీ సీనియర్ లీడర్. ఆయన ఎప్పటినుంచో మధుబన్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఆర్జేడీ అధిష్టానం మాత్రం మధుబన్ అసెంబ్లీ టికెట్ మదన్ షాకు కాకుండా సంతోష్ కుష్వాహాకు ఇచ్చింది. దీంతో తీవ్ర నిరాశ, అసంతృప్తికి గురైన మదన్ షా.. ఆదివారం (అక్టోబర్ 19) ఏకంగా ఆర్జేడీ చీఫ్ లాలూ ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. తన అభిమానులతో కలిసి నిరసన తెలపడమే కాకుండా మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించాడు.
అంతేకాకుండా తన ఒంటిపై ఉన్న బట్టలు చించి కింద పడేసి వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. మదన్ షా ఆందోళనతో లాలూ ఇంటి ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మదన్ షాను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మదన్ షా మాట్లాడుతూ.. లంచం ఇవ్వనందుకే తనకు టికెట్ నిరాకరించారని ఆరోపించారు.
రాజ్యసభ ఎంపీ, ఆర్జేడీ సీనియర్ లీడర్ సంజయ్ యాదవ్ టికెట్ కావాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నారు. బీజేపీ ఏజెంట్ డాక్టర్ సంతోష్ కుష్వాహాకు మధుబన్ సీటు ఇచ్చారని షా ఆరోపించారు. డబ్బున్న వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ నిజాయితీపరులైన కేడర్‌ను పార్టీ పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. లాలూ ప్రసాద్ యాదవ్ తనకు గురువు లాంటివారని.. మధుబన్ అసెంబ్లీ సెగ్మెంట్లో తాను గెలిచే అవకాశం ఉందని సర్వేలో తేలడంతో టికెట్ నాకే ఇస్తానని గతంలో లాలూ హామీ ఇచ్చారని మదన్ షా గుర్తు చేశారు.
1990ల నుండి తాను పార్టీ కోసం పనిచేస్తున్నానని, రాజకీయం కోసం సొంత భూమిని కూడా అమ్ముకున్నానని తెలిపాడు. లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ అహంకారి అని విమర్శించారు. అట్టడుగు వర్గాల కార్యకర్తలను అతడు నిర్లక్ష్యం చేస్తున్నాడని విమర్శించారు. ఆర్జేడీ అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపు అంతర్గత రాజకీయాలు, పక్షపాతంతో నడిచాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆర్జేడీ గెలవదని జోస్యం చెప్పారు మదన్ షా.