హైదరాబాద్ సిటీలో ప్రధానంగా వెస్ట్ సిటీలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఐటీ కారిడార్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి, మాదాపూర్, కొండాపూర్, మణికొండ, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఎస్ఆర్నగర్ వంటి ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ ప్రాంతాల్లో హైరైజ్, మల్టీ స్టోర్ బిల్డింగులు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, టౌన్‌షిప్‌లు వంటివి పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో కొందరు 2 వేల నుంచి 3 వేల అడుగుల వరకు బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు.
దీంతో చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడడంతో ఆయా ప్రాంతాల వాసులు వాటర్ బోర్డు అందించే ట్యాంకర్లపై ఆధార పడుతున్నారు. గత మే నెలలోనే అత్యధికంగా రోజుకు18 వేల వరకు ట్యాంకర్ల బుకింగ్జరగ్గా.. తాజాగా రోజుకు 20 వేల ట్యాంకర్ల బుకింగ్జరుగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అధికారులు ‘కోత’ నిర్ణయం తీసుకున్నారు.
వాటర్ హార్వెస్టింగ్ చట్టం పకడ్బందీగా అమలు చేస్తం: మంత్రి పొన్నం
హైదరాబాద్ నగరంలో వర్షపునీరు వృథాగా పోతోందని, భవిష్యత్ తరాలకు నీటిని అందించేందుకు గ్రౌండ్ వాటర్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇందుకోసం వాటర్ హార్వెస్టింగ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. మాన్సూన్ప్రిపరేషన్పై శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్ఆఫీసులో రివ్యూ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షపునీరు వృథా కాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ తరఫున ప్రజలకు అవగాహన కల్పిస్తామని, ఆ తర్వాత ప్రత్యేక టీమ్స్‌తో డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. 500 చదరపు గజాల బిల్డప్ కంటే ఎక్కువగా ఉన్న వాటిలో కచ్చితంగా వాటర్ హార్వెస్టింగ్ పిట్లు ఉండేలా చూడాలన్నారు.
అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాల్లో ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. అవగాహన కల్పించిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవన నిర్మాణాలు జరిగినప్పుడే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేసేలా సూచించాలన్నారు. ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల భాగస్వామ్యం ఉండాలని అన్నారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా వాటర్ సోర్స్ కావాలని తెలిపారు. తమ ప్రభుత్వ హాయంలోనే నగరానికి కృష్ణ ఫేజ్- 1,2, గోదావరి ఫేజ్- 1,2 ద్వారా నీళ్లు వచ్చాయని, ఆ తర్వాత కొత్తగా ఎవరూ నీటిని తీసుకు రాలేదని, ఇప్పుడు మళ్లీ తమ ప్రభుత్వంలోనే అదనంగా తాగునీరు తీసుకొస్తున్నామని చెప్పారు.
