ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో కేటుగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఈ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సెలబ్రిటీల ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ను లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు AI సాయంతో సృష్టించిన కొన్ని అభ్యంతరకర చిత్రాలను ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ చేశారు. దీంతో తన పరువుకు భంగం కలిగించడమే కాకుండా, తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసిన ఈ వ్యవహారంపై రుక్మిణి వసంత్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు
రుష్మిణి వసంత్ ఫిర్యాదుతో పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (BNS) కింద క్రైమ్ నెం. 36/2026గా కేసు నమోదు చేశారు. ఈ కేసును చేధించేందుకు సైబర్ క్రైమ్ విభాగం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. సాంకేతిక ఆధారాల సహాయంతో లేటెస్ట్ గా పోలీసులు ముగ్గురిని గుర్తించి అరెస్ట్ చేశారు. వారిని బాగల్‌కోటకు చెందిన రవికుమార్ (24), శివమొగ్గకు చెందిన చంద్రకాంత్ (33), బెంగళూరుకు చెందిన రంజిత్ (25)లుగా గుర్తించారు. వీరి నుంచి నేరానికి ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
రుక్మిణి స్ట్రాంగ్ వార్నింగ్
ఈ వివాదంపై గత మే నెలలోనే రుక్మిణి వసంత్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఆ ఫొటోలు ముమ్మాటికీ నకిలీవని, తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఫేక్ కంటెంట్‌ను షేర్ చేయడం ఆపాలని, లేదంటే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. చెప్పినట్టుగానే సైబర్ పోలీసులను ఆశ్రయించి నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు.
వరుస క్రేజీ ప్రాజెక్టులతో హవా
'సప్త సాగరదాచే ఎల్లో' సినిమాతో తెలుగు, కన్నడ ప్రేక్షకులకు బాగా దగ్గరైన రుక్మిణి వసంత్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయారు. ప్రస్తుతం 'కెజిఎఫ్' స్టార్ యష్ నటిస్తున్న ఈ హై-బడ్జెట్ యాక్షన్ డ్రామాలో రుక్మిణి 'మెలిస్సా' అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి కూడా నటిస్తున్నారు.
