ఐదుగురి మృతికి కారణమైన డ్రైవర్కు రెండేండ్ల జైలు

ఐదుగురి మృతికి కారణమైన డ్రైవర్కు రెండేండ్ల జైలు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో 11 ఏండ్ల కింద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతికి కారణమైన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కారు డ్రైవర్  చిప్ప హరీశ్​కు రెండేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ గోదావరిఖని ప్రిన్సిపల్  జూనియర్  సివిల్  జడ్జి నల్లాల వెంకట సచిన్ రెడ్డి బుధవారం తీర్పునిచ్చారు. 2015 డిసెంబర్ 13న అప్పటి రామగుండం మండలం సోమనపల్లి శివారులో బెల్లంపల్లికి చెందిన ఇండికా కార్ డ్రైవర్ చిప్ప హరీశ్​ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న సోమనపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఉప్పులేటి రాజేందర్, ఆటోలో ప్రయాణిస్తున్న పొట్యాలకు చెందిన సీహెచ్ మధునమ్మ, ఉప్పులేటి భూదమ్మ, కారులో ప్రయాణిస్తున్న ఎలిగేడు మండలం శివపల్లికి చెందిన పీఎంపీ, బెల్లంపల్లి మార్కెట్  ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ అంజద్  పాషా చనిపోయారు. ఈ కేసులో 15 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో ఈ మేరకు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.