హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రవాణా శాఖ సేవలు మరింత సులభతరం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ ద్వారా ఈ నెల 11 నుంచి వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (ఆర్‌సీ), డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. గత నెల 23న తెలంగాణ రవాణా శాఖను వాహన్ పోర్టల్‌తో అనుసంధానం చేశారు.
అయితే, ఇప్పటివరకు కేవలం నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు సంబంధించిన తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) సర్టిఫికెట్లను మాత్రమే ఈ పోర్టల్ ద్వారా జారీ చేస్తున్నారు. తాజా నిర్ణయంతో పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల ప్రక్రియ కూడా ఈ పోర్టల్ పరిధిలోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సేవలను వేగవంతం చేసేందుకు సుమారు 1,000 మంది షోరూం డీలర్లకు రవాణా శాఖ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.
వీరిలో 671 మంది డీలర్లు ఇప్పటికే వాహన్ పోర్టల్ ద్వారా సేవలు అందించేందుకు అధికారిక అనుమతులు పొందారు. డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసే వెసులుబాటు కలగడం వల్ల వాహనదారులకు ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది. అనుసంధాన ప్రక్రియ మొదలైన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 33 వేల తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు.
