మస్కట్/న్యూఢిల్లీ: ఇండియాకు చెందిన నౌకపై ఒమన్ సముద్ర తీరంలో డ్రోన్ దాడి జరిగింది. గుజరాత్‌కు చెందిన ‘హాజీ అలీ’అనే కార్గో నౌక సోమాలియా నుంచి షార్జాకు పశువులను తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఒమన్ ఉత్తర తీరంలోని లిమా సమీపంలో ప్రయాణిస్తుండగా, గుర్తుతెలియని డ్రోన్ ఒకటి నౌకను ఢీకొట్టింది.
దీంతో నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షిప్ సముద్రంలో మునిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది లైఫ్ బోట్ల ద్వారా నౌక నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఒమన్ కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగి షిప్‌లో ఉన్న 14 మంది భారతీయ సిబ్బందిని రక్షించి, దీబా పోర్టుకు చేర్చింది.
అయితే, నౌకలో ఉన్న పశువులు మొత్తం సముద్రంలో కొట్టుకుపోయాయి. మరోవైపు, నౌకపై జరిగిన దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలు, నేవీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
