భారీ వర్షాలొస్తే మళ్లీ మునుగుడే!

భారీ వర్షాలొస్తే మళ్లీ మునుగుడే!
  • ముందస్తు చర్యల్లేవ్​.. మళ్లీ మునుగుడే !
  • భారీ వానలొస్తే లోతట్టు ప్రాంతాల్లో పరేషానే

హైదరాబాద్, వెలుగు: వానాకాలం మొదలైపోవడంతో సిటీలోని జలాశయాల నుంచి ఈసారి వరద ముంపు తప్పేలా లేదు. గతేడాది వానలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ నిండిపోయాయి. ఇప్పటికి ఫుల్ ట్యాంక్ లెవెల్​కు ఐదు అడుగుల లోతున నీరు ఉంది. ఈ ఏడాది కూడా భారీ వానలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జలాశయాల పరిధిలోని లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల్లో గతేడాది వానలకు భారీగా వరద నీరు చేరినా, తాగునీటి అవసరాలకు కృష్ణా, గోదావరి జలాలనే వాటర్ బోర్డు వాడుకుంటోంది. ఈ రెండు జలాశయాల్లో పరిమితంగానే నీటి వాడకం ఉంది. ఈ మాన్​సూన్ సీజన్​లో భారీ వానలు పడితే లోతట్టు ప్రాంతాల వాసుల పరిస్థితి ఏంటనేది ఆందోళన కలిగిస్తోంది. అప్పటి వానలతో షేక్ పేట్, బండ్లగూడ, కిస్మత్ పురా, కార్వాన్, హైదర్ గూడ, లంగర్ హౌస్, మూసీ పరివాహక ప్రాంతాలు నీట ముగినిపోయాయి. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని వారిని తరలించారు. అయితే ముందస్తు చర్యలు వారం రోజుల ముందు నుంచే చేపట్టారు. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

తగ్గని నీటిమట్టం
గతేడాది అక్టోబర్​లో కురిసిన భారీ వానలతో 8 నెలలుగా జలాశయాలన్నీ నిండుగానే ఉన్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీళ్లను వాటర్​బోర్డు తక్కువ పరిమాణంలోనే తాగునీటికి వాడుతోంది. అయినా వాటిల్లో ఏమాత్రం నీరు తగ్గడంలేదు. ప్రస్తుతం ఐదు అడుగుల లోతులోనే నీటి మట్టం ఉంది.  రెండు గంటలు  వాన కురిస్తే ఫుల్ ట్యాంక్ లెవెల్​కు చేరే అవకాశం ఉంది.  దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉండనుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లోనే  వరద ఎఫెక్ట్ తీవ్రంగా ​ఉంటుంది. గండిపేట్ నుంచి నాగోల్ వరకు ఇరువైపులా వరద నీరు భారీగా ప్రవహించే అవకాశం ఉంది. 

గతేడాది ముందుగానే..
గతేడాది భారీ వానలకు ముందుగానే హుస్సేన్ సాగర్ దిగువన లోయర్ ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, లిబర్టీ, దోమలగూడ, గాంధీ నగర్, అశోక్ నగర్ ఏరియాల్లో వరద నియంత్రణ చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే భారీగా వరద నీరు చేరడంతో ఇండ్లన్నీ నీట మునిగాయి. ఆ తర్వాత హుస్సేన్ సాగర్​లో నీటిమట్టం తగ్గడంతో ప్రమాదం తప్పింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి పోటెత్తిన వరద నీటితో మూసీపై ఉన్న బ్రిడ్జిల మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. నది పరివాహక ప్రాంతాల్లోని బస్తీలు ముగినిపోయి, ఇంటి సామగ్రి కొట్టుకుపోయింది.  ప్రస్తుతం నిండుగా ఉన్న రిజర్వాయర్లను దృష్టిలో ఉంచుకుని, ముందస్తు వరద ముంపు తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నీటి మట్టాలు (అడుగుల్లో..)
జలాశయం    ఎఫ్​టీఎల్​​    ప్రస్తుతం    గతేడాది
ఉస్మాన్ సాగర్    1,790.00    1,782.06    1,753.06
హిమాయత్ సాగర్    1,763.05    1,759.15    1,730.55
హుస్సేన్ సాగర్    513.48    507.00    486.00