అంతా కార్పొరేట్ జర్నలిజమే..ప్రజా ప్రతినిధుల తప్పును ఎండగట్టే జర్నలిజం లేదు

అంతా కార్పొరేట్ జర్నలిజమే..ప్రజా ప్రతినిధుల తప్పును ఎండగట్టే జర్నలిజం లేదు
  • యజమానులే ఎడిటర్ డ్యూటీ చేస్తున్నరు
  • ప్రజా ప్రతినిధుల తప్పును ఎండగట్టే జర్నలిజం లేదు 
  • మాజీ ప్రధాని మీడియా సలహాదారు  సంజయ్ బారు ఆవేదన

పంజాగుట్ట, వెలుగు: జర్నలిజంలో మౌలిక విలువలు కరవయ్యాయని, ఇండియన్ మీడియాలో కార్పొరేట్ జర్నలిజం రాజ్యమేలుతోందని, యజమానులే ఎడిటర్ డ్యూటీ చేస్తున్నరని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు డా. సంజయ్​బారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మీడియా అంటేనే సంస్థల చేతిలో వార్తలు, విలేకరులు సైతం పావులుగా మారారన్నారు. ప్రజా ప్రతినిధుల తప్పును ఎండగట్టే జర్నలిజం లేదన్నారు. 

సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో వయోధిక పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు దాసు కేశవరావు అధ్వర్యంలో నిర్వహించిన ‘అనుభవాలు-జ్ఞాపకాలు’ ఉపన్యాస పరంపర పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇండియన్ జర్నలిజం తీరు తెన్నులపై ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సంస్థలు తాము ఏది ఆజ్ఞాపిస్తే అదే అంశాన్ని వార్తాంశంగా ఎంచుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.

 కేంద్ర సమాచార కమిషన్ పూర్వ కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తూ నిత్య నూతనంగా వార్తలు సేకరించే పద్ధతులను నేర్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులకు విరమనానంతరం జీవిత చరమాంకంలో భరోసా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలు, వివిధ పత్రికల్లో పనిచేసిన పూర్వ జర్నలిస్టులు పాల్గొన్నారు.