స్టూడెంట్ వీసాతో చదువుకోడానికి వచ్చి డ్రగ్స్ దందా నడిపిస్తున్న నైజీరియా యువకుడిని హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్ (HNEW) డిపోర్టేషన్ చేసింది. 2025 నవంబర్ 12వ తేదీన యువకుడు ఒంయేక కెలెచి విక్టర్ ను వాళ్ల దేశానికి సాగనంపారు. ఇతనికి బంజారాహిల్స్ పరిధిలో డ్రగ్ పెడ్లర్లతో సంబంధం కలిగి ఉన్నట్టు గుర్తించారు. నైజీరియాకు చెందిన డ్రగ్ సప్లయర్ సూచనలతో భారత్‌లో డ్రగ్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు.
చదువుకోవడానికి వచ్చి ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్ ట్రాఫికింగ్ లోకి దిగాడు. స్టూడెంట్ వీసాతో 2021లో భారత్‌కి వచ్చిన విక్టర్.. ఆర్థిక సమస్యలతో చదువులు మానేశాడు. వీసా గడువు 21-04-2024న ముగిసిన తర్వాత కూడా అక్రమంగా భారత్‌లోనే ఉన్నాడు. సరైన పత్రాలు చూపించలేకపోవడంతో H-NEW బృందం డిపోర్టేషన్ ప్రారంభించింది. FRRO, హైదరాబాద్ సహకారంతో ఎగ్జిట్ పర్మిట్ తీసుకుని నైజీరియాకు పంపించారు.
2022 నుండి ఇప్పటివరకు HNEW 23 విదేశీయులను డిపోర్ట్ చేసింది. వీరిలో 15-నైజీరియన్లు, 3-సూడానీస్, 2-ఐవరీ కోస్ట్, 1- టాంజానియన్, 1- మొరాకన్ ఉన్నారు. 2025లో రికార్డు స్థాయిలో 11 విదేశీయులను డిపోర్ట్ చేశారు అధికారులు. 2025లో 3 విదేశీయులను డ్రగ్ కేసుల్లో అరెస్ట్ చేసింది HNEW. డ్రగ్ మాఫియా కార్యకలాపాలపై HNEW నిరంతర చర్యలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలిపారు.
