- చూస్తూ వదిలేస్తే మరిన్ని ప్రాణాలు తీస్తరు..సీటీ సీపీ సజ్జనార్ ట్వీట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: మద్యం తాగి వాహనాలు నడిపేవారిని టెర్రరిస్టులుగా సిటీ సీపీ సజ్జనార్ మరోసారి అభివర్ణించారు. కర్నూల్లో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది మరణించిన ఘటనను గుర్తు చేస్తూ ఇది సాధారణ ప్రమాదం కాదని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
మద్యం మత్తులో బైకర్ బి. శివశంకర్ నిర్లక్ష్యం వల్లే ఈ ‘మారణహోమం’ జరిగిందని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం శివశంకర్ ఉదయం 2:24 గంటలకు పెట్రోల్ పోయించి 2:39 గంటలకు నియంత్రణ కోల్పోయి ఈ ఘోర ప్రమాదానికి కారణమయ్యాడన్నారు.
మద్యం తాగి డ్రైవింగ్ చేసేవారు జీవితాలు, కుటుంబాలు, భవిష్యత్తులను నాశనం చేస్తారని, వీరిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని సజ్జనార్ హెచ్చరించారు. హైదరాబాద్లో జీరో టాలరెన్స్ విధానంతో చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు. ఇలాంటి వారిని గమనిస్తే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మాకెందుకని వదిలేస్తే మరిన్ని ప్రాణనష్టాలు జరుగుతాయని పేర్కొన్నారు.
