మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్..స్కూటీని ఢీకొన్న కారు..స్పాట్ లోనే ఇద్దరు బీటెక్ స్టూడెంట్లు మృతి

మద్యం మత్తులో ర్యాష్  డ్రైవింగ్..స్కూటీని ఢీకొన్న కారు..స్పాట్ లోనే ఇద్దరు బీటెక్ స్టూడెంట్లు మృతి
  • రోడ్డు దాటుతున్న మరొకరికి తీవ్ర గాయాలు
  • హైదరాబాద్​లోని హస్తినాపురంలో ఘోర ప్రమాదం

ఎల్బీ నగర్, వెలుగు: హైదరాబాద్ లోని హస్తినాపురంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి ఓవర్ స్పీడ్ గా కారు నడిపి, ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొన్నాడు. మరొకరిని ఆసుపత్రి పాలు చేశాడు. హస్తినాపురం క్రిస్టియన్  కాలనీకి చెందిన కనకాల రామ్ కుమార్ రెడ్డి మంగళవారం అర్ధరాత్రి ఫుల్​గా మద్యం తాగి తన కారులో సాగర్  రింగ్  రోడ్డు ఫ్లైఓవర్  నుంచి హస్తినాపురం వైపు బయలుదేరాడు. తొలుత ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఆపై రోడ్డు దాటుతున్న మరో యువకుడిని కూడా ఢీకొన్నాడు. 

ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. వారిని నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన కంచర్ల శివ (20), మిర్యాలగూడ హౌసింగ్ బోర్డుకు చెందిన సందీప్ కుమార్ (20) గా గుర్తించారు. మృతులిద్దరూ స్టూడెంట్లు. రోడ్డు దాటుతున్న వ్యక్తిని రంగారెడ్డి జిల్లా లోయపల్లికి చెందిన సభావత్ శ్రీధర్ (23) గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  

నిందితుడిని అప్పగించాలని విద్యార్థుల ధర్నా

ప్రమాదంలో చనిపోయిన కంచర్ల శివ, సందీప్ కుమార్.. జోహెల్  మహావీర్  ఇంజినీరింగ్  కాలేజీలో బీటెక్  సెకండియర్ చదువుతున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే తోటి విద్యార్థులు అర్ధరాత్రి భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్  చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, మృతుల కుటుంబ సభ్యులు కూడా బుధవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్  ముందు ఆందోళనకు దిగారు. ఇద్దరి ప్రాణాలు బలికొన్న నిందితుడి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదని ఆరోపించారు. నిందితుడిపై వెంటనే కఠిన చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 

పోలీసులు నిందితులకు వత్తాసు పలికితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా.. నిందితుడిపై కేసు నమోదు చేశామని ఎల్బీ నగర్  అడిషనల్  డీసీపీ కోటేశ్వర్ రావు తెలిపారు.