బెంగళూరులోని చందాపురలో ఉన్న డి–స్కేల్స్ అకాడమీ స్కూల్ ఐరిస్ అనే కృత్రిమ మేధస్సు ఆధారిత రోబో టీచర్ను ప్రవేశపెట్టింది. ఈ రూబోను కేరళకు చెందిన మేకర్స్ ల్యాబ్ సంస్థ రూపొందించింది. ఇది భారతదేశపు విద్యారంగంలో సాంకేతికత వినియోగానికి ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఈ రోబో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, ఆంగ్లంతో సహా మొత్తం 40 భాషలను అర్థం చేసుకోగలదు. సాంఘికశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, గణితం వంటి వివిధ పాఠ్యాంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదు. ప్రతి తరగతిలో రోజుకు ఒక గంటపాటు ఈ రోబోతో పాఠాలు చెప్పించడానికి స్కూల్ ప్రణాళిక వేసింది.
జాతీయ విద్యా విధానం:
భారత జాతీయ విద్యా విధానం 2020 విద్యలో సాంకేతికత వినియోగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. స్కూల్ బోధన, మూల్యాంకనం, ఉపాధ్యాయుల శిక్షణలో ఏఐ, ఇతర సాంకేతికతలను సమగ్రపరచాలని ఇది పిలుపునిచ్చింది.
ఐరిస్ అనుకూలత
బహుభాషా విధానం: ఎన్ఈపీ 2020 ప్రధాన సూత్రాల్లో ఒకటి మాతృభాషలో బోధన, బహుభాషా విధానం. ఐరిస్ 40 భాషలను అర్థం చేసుకోగలగడం, ముఖ్యంగా తెలుగు, తమిళం, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లో మాట్లాడగలగడం, ఎన్ఈపీ లక్ష్యాలకు సంపూర్ణంగా అనుగుణంగా ఉన్నది.
ఇంటరాక్టివ్ లెర్నింగ్: సంప్రదాయ బోధనకు బదులుగా, విద్యార్థులు నేరుగా ప్రశ్నలు అడిగి, తక్షణమే సమాధానాలు పొందే ఇంటరాక్టివ్ విధానాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.
