నిర్భయ దోషుల ఉరికి.. ట్రయల్ 

నిర్భయ దోషుల ఉరికి.. ట్రయల్ 

న్యూ ఢిల్లీ:  నిర్భయ గ్యాంగ్ రేప్​ కేసులో మరణశిక్ష పడిన నలుగురిని ఉరి తీసేందుకు తీహార్ జైలులో ఆదివారం డమ్మీ ఉరిశిక్ష నిర్వహించినట్లు జైలు అధికారులు తెలిపారు. నిర్భయ దోషులైన ముఖేశ్​(32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)లను ఈ నెల 22న ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు ఈ నెల 7న డెత్ వారంట్ జారీ చేసింది. దోషుల బరువులు నమోదు చేసి, అందుకు తగినట్లు రాళ్లు నింపిన బస్తాలకు ఉరితాళ్లు బిగించి డమ్మీ ఉరి టెస్ట్ చేసినట్లు జైలుకు చెందిన ఒక సీనియర్ ఆఫీసర్ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఒకరి తర్వాత ఒకరు చొప్పున నలుగురిని ఉరితీసేలా జైలులోని 3వ నంబర్ గదిలో ఏర్పాట్లు పూర్తికావచ్చాయని ఆయన చెప్పారు. ఉరితీసేందుకు ఇద్దరు తలారులను పంపాలని యూపీ అధికారులకు చేసిన విజ్ఞప్తి మేరకు మీరట్​జైలు తలారి పవన్ జల్లాద్​ను పంపేందుకు వారు అంగీకరించారని
చెప్పారు.

వారి మానసిక స్థితి బాగానే ఉంది

నలుగురు దోషుల మెంటల్ కండిషన్​ ను అబ్జర్వ్ చేసేందుకు జైలు అధికారులు రెగ్యులర్​గా వారితో మాట్లాడుతున్నారని తెలిపారు. అయితే వారి మానసిక స్థితి సాధారణంగానే ఉందని, ఉరిశిక్ష ఆగిపోతుందని వారు నమ్ముతున్నట్లుగా ఉందని జైలు అధికారి అన్నారు. నిర్భయను 2012 డిసెంబర్ 16న ఆరుగురు నిందితులు మూకుమ్మడిగా రేప్ చేసి దారుణంగా హింసించడంతో ఆమె మృత్యువుతో పోరాడి 2012 డిసెంబర్ 29న  సింగపూర్​లోని హాస్పిటల్ లో చనిపోయారు. ఆరుగురు దోషుల్లో ఒకరు రామ్ సింగ్  జైల్లోనే ఉరివేసుకుని సూసైడ్ చేసుకోగా మరొకరు మైనర్ కావడంతో మూడేళ్ల పాటు జువైనల్ హోంకి తరలించారు. మిగిలిన నలుగురు దోషులను ఈ నెల 22న ఉరితీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నలుగురు దోషులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను ఇప్పటికే సుప్రీం కోర్టు కొట్టివేసింది. అయితే ఇందులో ఇద్దరు దోషులు వేసిన క్యురేటివ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది.