
ఓటేసిన తర్వాత చనిపోయిన మరొకరు
పోతంగల్(కోటగిరి), చేర్యాల, నర్సింహులపేట, ఉప్పల్, వెలుగు: ఓటేసేందుకు వచ్చి ముగ్గురు వృద్ధులు మరణించారు. ఓటేసిన వెంటనే గుండెపోటుతో మరో మహిళ మృతి చెందింది. చేర్యాల మండల కేంద్రంలోని పెద్దమ్మ గడ్డ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఇప్పకాయల సరోజన (75) ఓటు హక్కును వినియోగించుకుంది. పోలింగ్ కేంద్రం నుంచి బయటికి రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా గుండెపోటుతో ఆమె మరణించిందని డాక్టర్లు చెప్పారు.
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రానికి చెందిన శ్రీ గంధం గిర్మవ్వ (75) మండల కేంద్రంలోని 21వ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకుంది. ఆ తర్వాత అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన అధికారులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందిందని పేర్కొన్నారు. ఉప్పల్ ఓల్డ్ భరత్ నగర్ కు చెందిన గట్టు విజయలక్ష్మి (65) కాలనీలోని పెద్ద మసీదు వద్ద ఉన్న పోలింగ్ బూత్ 349లో ఓటేసేందుకు వచ్చింది. ఎండ వేడిమికి తట్టుకోలేక ఆమె ఆకస్మాత్తుగా స్పృహా కోల్పోయింది.
వెంటనే స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు ఆమె అప్పటికే మృతి చెందిందని పేర్కొన్నారు. ఓటేసిన తర్వాత గుండెపోటుతో మరో మహిళ చనిపోయింది. మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహుల పేట మండలం కొమ్ములవంచలో ఈ ఘటన జరిగింది. కొమ్ములవంచ గ్రామానికి చెందిన దొంతు వీరమ్మ (55) గ్రామంలోని స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకుంది. ఆ తర్వాత ఇంటికి రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయిది. వెంటనే కుటుంబ సభ్యులు దీనిని గుర్తించి హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే ఆమె మృతి చెందింది.