న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పర్సనల్ స్టాఫ్ తనపై దాడి చేశారని రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ ఆరోపణలు చేశారు. సీఎం అధికారిక నివాసంలోనే తనపై దాడి జరిగినట్లు ఎంపీ చెప్పారని పోలీసులు వెల్లడించారు. అయితే, దీనిపై ఇంకా అధికారికంగా ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఢిల్లీ నార్త్ డీసీపీ ఎంకే మీనా సోమవారం మీడియాతో మాట్లాడారు. " ఢిల్లీ సీఎం నివాసంలో తనపై దాడి జరిగిందని మాలీవాల్ మొబైల్ నంబర్ నుంచి ఉదయం 9.34 గంటలకు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు కాల్ వచ్చింది.
దాంతో స్టేషన్ నుంచి ఓ టీమ్ సీఎం నివాసానికి చేరుకుంది. అక్కడ ఎంపీ కనిపించలేదు. కొంతసేపటికి(ఉదయం 10 గంటలకు) ఎంపీనే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఎఫ్‌ఐఆర్ నమోదుకు మెడికల్ టెస్ట్ అవసరమని ఆమెకు వివరించాం. దాంతో తాను తర్వాత ఫిర్యాదు చేస్తానని చెప్పి ఎంపీ స్వాతి మాలీవాల్ వెళ్లిపోయారు" అని పేర్కొన్నారు. కాగా, ఈ వార్తలపై బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్పందిస్తూ.. మాలీవాల్ ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులకు గురైన మహిళలకు వెంటనే న్యాయం జరగాలని అన్నారు.
