దుండిగల్, వెలుగు: వెండి చోరీ కేసులో ముగ్గురు నిందితులను దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, సీసీఎస్ఏసీపీ నాగేశ్వరరావు, సీఐ సతీశ్ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. నాతురాం, చేతన్ ప్రకాశ్, సిరాజుద్దీన్, మహేందర్, జైతరాన్ గోవింద్, కలురామ్ గత నెల 7న బౌరంపేటలోని సంగమేశ్వర జ్యువెల్లరీ షాపు పక్కన షట్టర్ అద్దెకు తీసుకున్నారు. అదేరోజు అర్ధరాత్రి ఆ గది నుంచి పక్కనే ఉన్న జ్యువెల్లరీ షాప్‌కు కన్నం వేశారు. మొత్తం 15 కేజీల వెండిని ఎత్తుకెళ్లారు.
రాజస్థాన్ వెళ్లి నిందితుల అరెస్ట్
మరుసటి రోజు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు చేతన ప్రకాశ్(రాజస్థాన్), సిరాజుద్దీన్(రాజస్థాన్)ను గత నెల 19న రాజస్థాన్ వెళ్లి, కలురామ్(మధ్యప్రదేశ్)ను 26న బహదూర్‌పల్లిలో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి15 కేజీల వెండి, బొలెరో వాహనం, చోరీకి వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారని ఏసీపీ శంకర్ రెడ్డి పేర్కొన్నారు.
