దుర్గం చెరువు అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి.. GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్

దుర్గం చెరువు అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి.. GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్

 హైదరాబాద్ సిటీ, వెలుగు: దుర్గం చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. బుధవారం దుర్గం చెరువును ఆయన పరిశీలించారు. చెరువు ప్రొటెక్షన్ పనులతో పాటు ప్రతిపాదిత అభివృద్ధి పనులను వేగంగా చేయాలని ఇంజినీరింగ్, ఎస్ఎన్డీపీ, లేక్స్ విభాగాల అధికారులతోపాటు రహేజా ఐటీ పార్క్  ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు సూచించారు. మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాల సమయంలో పరిసర కాలనీలు ముంపు బారిన పడకుండా చెరువులో నీటిని ఎఫ్టీఎల్ కంటే తక్కువగా ఉంచాలని లేక్స్ విభాగానికి ఆదేశించారు.

పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలి..

పారిశుధ్య కార్యక్రమాలపై కఠిన పర్యవేక్షణ చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాలపై బల్దియా హెడ్డాఫీస్​లో  కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్​తో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రైమరీ కలెక్షన్​లో లోటుపాట్లు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల క్లియరెన్స్, అదనపు బిన్​ల ఏర్పాటు, చెత్త సేకరణ సమస్యలపై చర్చించారు. కమిషనర్ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక సమస్యలకు నిర్మాణాత్మక పరిష్కారాలను అమలు చేయాలని సూచించారు. నగరంలో స్వచ్ఛత కార్యక్రమాలు మెరుగుపడేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శన

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గోల్నాక వినాయకనగర్​లో విద్యార్థుల కళారూపాలు ఆకట్టుకున్నాయి. బేబీ వేద ప్రపుజ్య, మాస్టర్ సాయి అతుల్య, బేబీ అన్విక, బేబీ శాన్విక గిరిజన కల్యాణాన్ని ఆధారంగా చేసుకుని నృత్యం చేశారు. చిన్నారుల ప్రదర్శనలు బాగున్నాయని వీక్షకులు కొనియాడారు.