ఈ-పాస్‍ ద్వారా..మిడ్​ డే మీల్స్

ఈ-పాస్‍ ద్వారా..మిడ్​ డే మీల్స్

హైదరాబాద్‍, వెలుగు:ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పారదర్శకంగా  అమలుకు పౌరసరఫరాల శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. మిడ్​ డే మిల్స్​కు ఈ పాస్​ విధానాన్ని అనుసంధానం చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ప్రతిరోజూ పాఠశాలకు హాజరువుతున్న విద్యార్ధుల సంఖ్య, ఆరోజు మధ్యాహ్నం భోజనం చేసిన వారి వివరాలు క్షణాల్లో సివిల్​ సప్లై ఆఫీసుకు ఆన్​లైన్​లో సమాచారం అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్ధుల హాజరుకు అనుగుణంగా సరుకులు పంపిణీ చేసేందుకు వీలుగా ఉంటుందనేది సివిల్​సప్లై అధికారుల ప్రయత్నం.   పాఠశాలలో విద్యార్ధుల  హాజరు తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఈ పాస్‍లో  నమోదు చేసే అంశాలపై మండల విద్యాధికారులు(ఎంఈవో),  స్కూల్‍ హెడ్‍ మాస్టర్‍, కంప్యూటర్‍ ఆపరేటర్లకు సివిల్‍ సప్లై అధికారులు ఇటీవల శిక్షణ  కార్యక్రమాన్ని  నిర్వహించారు. త్వరలోనే ఈ విధానాన్ని పగడ్బందీగా అమలు చేయనున్నారు.  ఈపాస్​ వల్ల ఉపాధ్యాయులు అధికారుల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. స్కూల్​కు  హాజరైన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రతినెల రేషన్‍ సరుకులను ఖచ్చితంగా మిడ్‍డే మీల్స్ అందజేసే సంస్థలకు విడుదల చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.  రేషన్‍ దుకాణాల్లో ఈపాస్‍ విధానం సక్సెస్‍ కావ్వడంతో దాని విస్తరణకు  అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  ఈ  విధానంతో అటూ సమయం ఇటూ పారదర్శకంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

టీచర్లకు సమయం మిగులు

జిల్లాలో దాదాపు 686 ప్రభుత్వ ప్రైమరీ, హై స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో దాదాపు 92 వేల మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరితో పాటు మైనార్టీ విద్యాసంస్థలు(మదర్సాలు) తదితర వాటిల్లో చదివే విద్యార్థులుకు సైతం ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తుంది. జిల్లా పరిధిలోని 24 మండలాలు ఉన్నాయి. మండలాల పరిధిలో డిప్యూటీ ఇన్‍స్పెక్టర్‍ ఆఫ్‍  స్కూల్స్(ఐఓఎస్‍) అధికారులు  మధ్యాహ్న భోజన పథక అమలును పర్యవేక్షిస్తున్నారు.  ఇప్పటి వరకు  విద్యార్థుల హాజరును ప్రతినెల డీఈవో ఆమోదంతో జిల్లా సివిల్‍ సప్లై అధికారులకు అందజేసే వారు. ఈ విధానంలో సంబంధిత డాక్యుమెంట్స్, ఇండెంట్‍, భోజనం తనిఖీల క్రమంలో టీచర్లకు బోలేడు సమయం వృథా అవుతుండేది. అలాగే విద్యార్థుల సంఖ్య పరంగా ఇబ్బందులు తలెత్తేవి. దీంతో కొన్ని సార్లు మధ్యాహ్న భోజనం వృథా అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉండేవి.  ఈపాస్‍తో ఆ కష్టాలు దాదాపుగా తీరిపోతాయని టీచర్లు అభిప్రాయపడుతున్నారు.  విద్యార్థులు సంఖ్యను ఆధారంగా చేసుకొని ప్రతినెల రేషన్​ సరుకులు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే  సంస్థలకు అందజేస్తుంది. ఆ నెలలో భోజనం చేసిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్వహణ బిల్లులను చెల్లించేందుకు సైతం ఇక మీదట ఈ పాస్‍ విధానంలో హాజరు కీలకం కానున్నది.

 వెబ్‍సైట్‍లో నమోదు

జిల్లా పరిధిలోని మధ్నాహ్న భోజనం అమల్లో ఉన్న పాఠశాలలు వాటి వివరాలను ముందుగా epos.telangana.gov.in వెబ్‍సైట్‍లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీదట  ఈ–పాస్‍ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని అమలుకు మండల స్థాయిలో ముగ్గురికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఐఓఎస్‍తోపాటు స్కూల్‍ పరిధిలో స్కూల్‍ హెడ్‍మాస్టర్‍, మధ్యాహ్న భోజన నిర్వహణ అధికారి ఉంటారు. ఈ ముగ్గురికి సంబంధించిన ఆధార్‍ సంఖ్య, ఫోన్‍ నెంబర్లతో  వెబ్‍సైట్‍లో రిజిస్ట్రేషన్‍ చేసుకోవాలి. వీరి వెలిముద్రలను ఈ పాస్‍ మెషిన్‍లో అధికారులు సెట్‍ చేస్తారు. ఈ–పాస్‍ను వినియోగించే క్రమంలో వీరు తమ వేలిముద్రల సాయంతో అప్‍డేట్‍ చేయాల్సి ఉంటుంది. ఈ కాగిత రహిత విధానంలో పారదర్శకత, సత్వర బిల్లుల చెల్లింపులు, మధ్యాహ్న భోజనం వృథాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు అభిప్రాయడుతున్నారు.

పారదర్శకత పెరుగుతుంది

మధ్యాహ్న భోజన పథకం పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వ ఈ –పాస్‍ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ–పాస్‍ విధానంపై జిల్లాలోని ఐఓఎస్‍, కంప్యూటర్‍ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చాం. మధ్యాహ్న భోజన పథకంలో హాజరు తదితర వివరాలు ఖచ్చితంగా అమలవుతాయి. ఇక నుంచి బిల్లుల చెల్లింపులు ఆన్‍లైన్‍లోనే జరుగుతాయి.

– భద్రయ్య, జిల్లా ఎన్‍ఐసీ ఆఫీసర్‍