రాజ్యాంగాన్ని ముట్టుకుంటే మాడి మసైపోతరు : మంత్రి పొన్నం ప్రభాకర్

రాజ్యాంగాన్ని ముట్టుకుంటే మాడి మసైపోతరు : మంత్రి పొన్నం ప్రభాకర్

హైదారాబాద్, వెలుగు: బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ మార్చడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. దానిని ముట్టుకుంటే మాడి మసైపోతారని హెచ్చరించారు. సోమవారం గాంధీ భవన్​లో పొన్నం మీడియాతో మాట్లాడారు.  రిజర్వేషన్లను టచ్ చేస్తే బీజేపీ తోడ్కలు తీస్తమన్నారు. రాముడిని నమ్ముకుని కాషాయ పార్టీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. 

బీసీ, ఎస్టీ, ఎస్సీలంతా ఏకమై బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని.. కానీ, ఆ ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుంటుందని వెల్లడించారు. రెండు దశల పోలింగ్ ముగియగానే బీజేపీకి మెజార్టీ సీట్లు రావని సర్వేలు చెబుతున్నాయని.. అందువల్ల మోదీ, అమిత్ షా ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు ఇస్తున్నారని ఆరోపించారు. 

గొల్ల కురమల కార్పొరేషన్  ఏర్పాటుకు సీఎం అంగీకరించిన్రు

గొల్ల కురమల కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం సానుకూలంగా స్పందించారని మంత్రి పొన్నం తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియగానే కార్పొరేషన్​ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సోమవారం గాంధీ భవన్ లో జరిగిన గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆలేరు నుంచి బీర్ల అయిలయ్య గెలిచి కురుమలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ పదవుల్లో కురుమలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.