డ్రగ్స్‌ పార్సిల్‌ పేరిట 18.5 లక్షలు కాజేసిన చీటర్స్‌

డ్రగ్స్‌ పార్సిల్‌  పేరిట 18.5 లక్షలు కాజేసిన చీటర్స్‌

బషీర్ బాగ్, వెలుగు: విదేశాలకు డ్రగ్స్‌ పార్సిల్‌ చేస్తున్నారంటూ ఓ వ్యక్తిని సైబర్‌ నేరగాళ్లు మోసగించి రూ.. లక్షల్లో కాజేశారు.  సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన మేరకు.. సిటీకి చెందిన 51 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగికి ముంబైలోని అంధేరీలో డీహెచ్‌ఎల్‌ ఇంటర్నేషనల్‌ కొరియర్‌ సర్వీసెస్‌ పేరుతో ఫోన్‌ కాల్‌ వచ్చింది. షాంఘై నుంచి బాధితుడి ఆధార్‌ నంబర్‌ తో పార్శిల్‌ వచ్చిందని, అందులో ఎండీఎంఏ డ్రగ్స్‌తో పాటు, ఏటీఎం కార్డులు, 15 పాస్‌పోర్టులు, ఒక ల్యాప్‌టాప్, నాలుగు కేజీల బట్టలు ఉన్నాయని చెప్పారు. 

ఇందుకు ముంబయి పోలీసుల నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత పోలీసు అధికారిని ప్రొఫైల్‌ ఫొటోతో ఉన్న వాట్సాప్‌ వీడియో కాల్‌ వచ్చింది. నార్కోటిక్‌ విభాగం నుంచి కాల్‌ చేస్తున్నామని, ముంబయిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో బాధితుడి పేరుతో ఉన్న బ్యాంక్‌ ఖాతా నుంచి మనీలాండరింగ్‌ జరిగిందని భయపెట్టడమే కాకుండా ఎఫ్‌ఐఆర్‌ కూడా అయిందని, వెంటనే అరెస్ట్‌ చేస్తామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు కేసు నుంచి బయటపడేయాలంటే ఏం చేయాలో అడిగాడు. 

బాధితుడి బ్యాంక్‌ అకౌంట్స్‌ లోని మొత్తం డబ్బులను తమ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేయాలని, వెరిఫై చేసి తిరిగి పంపిస్తామని నమ్మించారు. దీంతో వారు చెప్పిన అకౌంట్లకు బాధితుడు మొత్తం రూ.18,50 లక్షలు పంపించాడు. అనంతరం క్రిమినల్స్ రిప్లై ఇవ్వకపోవడంతో మోసపోయానని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.