పార్లమెంట్​ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు : ప్రియాంక అల

పార్లమెంట్​ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు : ప్రియాంక అల
  •     మే 4 నుంచి 6 వరకు హోమ్​ ఓటింగ్​ పూర్తి
  •     భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పార్లమెంట్​  ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్​ ప్రియాంక అల పేర్కొన్నారు. కలెక్టరేట్​లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఖమ్మం లోక్​ సభ నియోజకవర్గానికి 35 మంది, మహబూబాబాద్​ లోక్​ సభకు 23 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు.

ఖమ్మం పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయన్నారు. మహబూబాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలో జిల్లాలో ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలున్నాయన్నారు. జిల్లాలో 9,88,238 మంది ఓటర్లున్నారని తెలిపారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎం, వీవీ ప్యాడ్​లను పంపించామన్నారు.

జిల్లాలో మే 4వ తేదీ నుంచి ఆరో తేదీ వరకు హోమ్​ ఓటింగ్​ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. పోలింగ్​ కేంద్రాల్లో సీసీ కెమోరాల ఏర్పాటు, వెబ్​ కాస్టింగ్​ ద్వారా పోలింగ్​ ప్రక్రియను చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో 1163 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్​ కేంద్రాల వద్ద పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యంతో పాటు టెంట్లు వేస్తున్నామన్నారు. టాయ్​లెట్లు, దివ్యాంగులకు ర్యాంప్​లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్, ఎన్నికల సూపరింటెండెంట్​ ధారా ప్రసాద్​ పాల్గొన్నారు.