గ్రేటర్ ​లోక్​సభ బరిలో 140 మంది అభ్యర్థులు

గ్రేటర్ ​లోక్​సభ బరిలో 140 మంది అభ్యర్థులు

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ముగిసింది. గ్రేటర్​పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాల బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను ఎన్నికల అధికారులు సోమవారం ఫైనల్​ చేశారు. అత్యధికంగా సికింద్రాబాద్ నుంచి 45 మంది పోటీలో ఉన్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో 30 మంది, చేవెళ్లలో 43 మంది, మల్కాజిగిరిలో 22 మంది పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 

హైదరాబాద్​లోక్​సభ స్థానానికి నామినేషన్లు వేసిన వారిలో 8 మంది అభ్యర్థులు  ఉపసంహరించుకున్నారని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్​ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సాధారణ పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో గుర్తులను కేటాయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ పీఐ శ్రీవిద్య, డీఆర్వో వెంకటాచారి, నామినేషన్లు వేసిన అభ్యర్థులు పాల్గొన్నారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్​నుంచి మొహమ్మద్​వలీఉల్లా సమీర్, బీజేపీ నుంచి కొంపెల్ల మాధవీలత, బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు.  

సికింద్రాబాద్ లో ఒక్కరే విత్​డ్రా

సికింద్రాబాద్​స్థానం నుంచి పోటీ చేసేందుకు మొత్తం 46 మంది నామినేషన్లు వేయగా, చివరి రోజు ఒక్కరు మాత్రమే విత్​డ్రా చేసుకున్నారు. మొత్తంగా లష్కర్​బరిలో 45 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి టి.పద్మారావుగౌడ్, బహుజన్​సమాజ్​పార్టీ నుంచి దండెపు బస్వానందం పోటీ చేస్తున్నారు.

చేవెళ్లలో ముగ్గురు విత్​డ్రా

చేవెళ్ల లోక్​సభ స్థానానికి నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్థులు సోమవారం విత్​డ్రా చేసుకున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రిటర్నింగ్​ఆఫీసర్ శశాంక తెలిపారు. మొత్తం 64 మంది నామినేషన్లు వేయగా, స్క్రూటినీలో 18 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని చెప్పారు. 46 మందిలో ముగ్గురు నామినేషన్లను ఉపసంహరించుకోగా, ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు మిగిలారని వెల్లడించారు. 

సాధారణ పరిశీలకులు రాజేందర్ కుమార్ కటారియా అభ్యర్థులకు గుర్తులను కేటాయించారని చెప్పారు. అడిషనల్​కలెక్టర్ ప్రతిమాసింగ్, అభ్యర్థులు పాల్గొన్నారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిలో బీఎస్పీ అభ్యర్థి గోపిరెడ్డి చంద్రశేఖర్​తోపాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్​రెడ్డి, కాంగ్రెస్​నుంచి గడ్డం రంజిత్​రెడ్డి, బీఆర్ఎస్​నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీలో ఉన్నారు. 

అలాగే మల్కాజిగిరి స్థానానికి 37 మంది నామినేషన్లు వేయగా, 15 మంది విత్​డ్రా చేసుకున్నారు. 22 మంది ఎన్నికల బరిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్​నుంచి సునీతామహేందర్​రెడ్డి, బీఆర్ఎస్​ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. 

కొండా వర్సెస్​ కొండా, రంజిత్​ వర్సెస్ ​రంజిత్

చేవెళ్ల నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు సేమ్​ ఉండడం నేతలను కలవర పెడుతోంది. ఓటర్లు కన్ఫ్యూజ్​ అయితే ఓట్లు చేజారే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్​రెడ్డి పోటీ చేస్తుండగా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్​రెడ్డి అనే వ్యక్తి బరిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్​ పార్టీ నుంచి గడ్డం రంజిత్​రెడ్డి పోటీ చేస్తుండగా, రివల్యూషనరీ సోషలిస్ట్​ పార్టీ నుంచి గాదె రంజిత్​రెడ్డి అనే వ్యక్తి బరిలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ సెగ్మెంట్​లో బీఆర్ఎస్ ​నుంచి పోటీ చేసిన దేవిరెడ్డి సుధీర్​రెడ్డి, బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పేర్లతో ఉన్న వ్యక్తులు ఇతర పార్టీల నుంచి బరిలో నిలవడంతో ఓట్లు చీలాయని, ఈసారి చేవెళ్లలో అలాగే జరిగితే ఓట్లు చేజారుతాయని నేతలు టెన్షన్ ​పడుతున్నారు