సారా బట్టీలపై ఎక్సైజ్​పోలీసుల దాడులు

సారా బట్టీలపై ఎక్సైజ్​పోలీసుల దాడులు
  •     26 లీటర్ల నాటుసారా, 850 కిలోల పటిక,105 మద్యం సీసాలు, 
  •     9 వాహనాలు సీజ్ 

హుజూర్ నగర్, వెలుగు : హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో బెల్టు షాపులు,  సారా బట్టీలపై ఎక్సైజ్, ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు విస్తృతంగా దాడులు చేశారు. 26 లీటర్ల నాటుసారా,850 కిలోల పటిక,105 మద్యం సీసాలు,9 వాహనాలు సీజ్ చేసి12 మంది పై కేసు నమోదు చేశారు. సోమవారం ఎక్సైజ్ ఇన్​స్పెక్టర్​జిన్నా నాగార్జునరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.

చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండా కు చెందిన లావుడ్యా బుజ్జి తన ట్రాక్టర్ లో 5 బస్తాలలో 250 కిలోల పటికను కొత్త తండాలో సారా తయారీదారులకు సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకుని ట్రాక్టర్ ను సీజ్ చేశారు. దొండపాడులోఎక్సైజ్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా100 కిలోల పటికతో వస్తున్న ఓ వ్యక్తి టూవీలర్ ను వదిలి పెట్టి పారిపోగా, వెహికిల్ ను సీజ్ చేశారు. మేళ్లచెర్వు మండలం శివ బాలాజీ తండా కు చెందిన బానోతు సైదా 10 లీటర్ల నాటు సారాను హీరో హోండా బైక్ పై తరలిస్తుండగా పట్టుకొని అతడిపై కేసు నమోదు చేశారు.

మఠంపల్లి మండలం కొత్తతండా కు చెందిన బానోతు ఎలమంద 100 కిలోల పటికను తరలిస్తుండగా అతడితోపాటు టూవీలర్ ను స్వాధీనం చేసుకున్నారు. మట్టపల్లి గ్రామానికి చెందిన ధర్మేంద్ర రేనాల్డ్ క్విడ్ కార్ లో మద్యం దాచి ఆంధ్రాకు తరలిస్తుండగా105 మద్యం సీసాలుతోపాటు కార్ ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. దోనబండ కు చెందిన మాలోతుసైదా టీవీఎస్ పై 6 లీటర్ల నాటు సారా తరలిస్తుండగా పట్టుకున్నారు.

పాలకీడు  మండలం బెట్టే తండాకు చెందిన చత్రు, అశోక్, గణేశ్ ఆటో లో250 కిలోల పటికను తరలిస్తుండగా ఆటోను సీజ్ చేసి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన అశోక్  నుంచి10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా బుధవాడకు చెందిన గుగులోతు రమేశ్ 150 కిలోల పటికను మేళ్లచెర్వు మండలానికి తరలిస్తుండగా అతడి పట్టుకుని వాహనం సీజ్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్​స్పెక్టర్​తెలిపారు. దాడుల్లో ఎస్ఐలు జగన్మోహన్ రెడ్డి, దివ్య, వెన్నెల, గోవర్ధన్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.